⚡ BREAKING

Horticulture: భారత్‌లో ఉద్యానవన పంటల ఉత్పత్తికి భారీ వృద్ధి! 3,778 లక్షల టన్నులకు చేరనున్న హార్టికల్చర్ ఉత్పత్తి!

Horticulture: దేశంలో ఉద్యానవన పంటల సాగు, ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Horticulture
Horticulture

పండ్లు, కూరగాయలు, పూల సాగులో దేశానికి కొత్త ఊపు..

2025-26లో హార్టికల్చర్ రంగంలో గణనీయమైన అభివృద్ధి అంచనాలు..

న్యూఢిల్లీ: దేశంలో ఉద్యానవన పంటల సాగు, ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ఉద్యానవన పంటల రెండో ముందస్తు అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా పండ్ల, కూరగాయల, పూలు, సుగంధ మరియు ఔషధ పంటల ఉత్పత్తిలో వృద్ధి నమోదుకానుంది.

కేంద్రం అంచనాల ప్రకారం 2025-26లో దేశంలోని మొత్తం ఉద్యానవన పంటల ఉత్పత్తి సుమారు 3,778 లక్షల టన్నులకు చేరే అవకాశం ఉంది. ఇది 2024-25తో పోలిస్తే దాదాపు 70.39 లక్షల టన్నుల పెరుగుదలగా నమోదవుతోంది.

అలాగే ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం కూడా స్వల్పంగా పెరగనుంది. 2025-26లో దేశవ్యాప్తంగా హార్టికల్చర్ పంటల సాగు విస్తీర్ణం 301.51 లక్షల హెక్టార్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 0.14 లక్షల హెక్టార్ల పెరుగుదలగా ఉంది.

పండ్ల ఉత్పత్తిలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించనుంది. 2025-26లో దేశవ్యాప్తంగా 1,214 లక్షల టన్నులకు పైగా పండ్ల ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. అరటి, మామిడి, బొప్పాయి, ఆపిల్, జామ వంటి పంటల దిగుబడి పెరగడం దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది.

కూరగాయల విభాగంలో ముఖ్యమైన ఉల్లిపాయ ఉత్పత్తి కూడా పెరగనుంది. ఈ ఏడాది 307 లక్షల టన్నులకు పైగా ఉల్లిపాయ ఉత్పత్తి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

అదేవిధంగా పూల సాగులో కూడా అభివృద్ధి కొనసాగనుంది. 2025-26 కాలంలో దేశంలో 45 లక్షల టన్నులకు పైగా పూల ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వివరించింది.

రైతులు కొత్త పద్ధతులు, మెరుగైన సాగు విధానాలను అనుసరించడం, పంటలపై ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలు ఉద్యానవన రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయని అధికారులు తెలిపారు. పండ్లు, కూరగాయలు, పూలు వంటి ఉద్యానవన పంటల పెరుగుదల రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు దేశ ఆహార భద్రతకు కూడా మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

Be the first to react

Latest