Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!
Defence: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తి విలువ రూ.1.78 లక్షల కోట్లకు చేరి ఇప్పటివరకు అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
రక్షణ రంగంలో చరిత్ర సృష్టించిన భారత్.. ఉత్పత్తి విలువ రూ.1.78 లక్షల కోట్లు..
ఐదేళ్లలో 110% వృద్ధి.. రక్షణ రంగంలో భారత్‌కు భారీ విజయగాథ..
భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తి విలువ రూ.1.78 లక్షల కోట్లకు చేరి ఇప్పటివరకు అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
సోషల్ మీడియా వేదికగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1.54 లక్షల కోట్ల ఉత్పత్తితో పోలిస్తే ఈసారి 15.6 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.84 వేల కోట్ల ఉత్పత్తితో పోలిస్తే ప్రస్తుతం 110 శాతం పెరుగుదల సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇంకా 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.4,746 కోట్లుగా ఉన్న స్వదేశీ రక్షణ ఉత్పత్తి విలువ ప్రస్తుతం దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశంలో రక్షణ తయారీ సామర్థ్యం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా రక్షణ ఉత్పత్తి రంగంలో కనిపిస్తున్న ఈ పురోగతి వెనుక రక్షణ ఉత్పత్తి విభాగం, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు సహా అన్ని భాగస్వాముల సమిష్టి కృషి ఉందని మంత్రి అభినందించారు.
భారత రక్షణ పరిశ్రమకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక విధానాలు, కొత్త కార్యక్రమాలు, ప్రైవేట్ రంగం పెరుగుతున్న భాగస్వామ్యం, రక్షణ ఎగుమతుల్లో నమోదవుతున్న వృద్ధి కారణంగా ఈ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశాన్ని రక్షణ ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని, రాబోయే సంవత్సరాల్లో భారత రక్షణ రంగం ప్రపంచ స్థాయిలో మరింత బలపడుతుందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Be the first to react