తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో మరోసారి సినీ గ్లామర్ హాట్‌టాపిక్‌గా మారింది. ఒకప్పుడు వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ హీరోయిన్ ఆమని, ఇప్పుడు కాషాయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం అధికారికంగా బీజేపీ సభ్యత్వం అందజేశారు. సినీ నేపథ్యం కలిగిన ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం సహజమే అయినప్పటికీ, ఆమని ఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
బీజేపీలో చేరిన సందర్భంగా ఆమని భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధానాలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పారు. “భారతీయురాలిగా గర్వపడే స్థితిని మోదీ గారు తీసుకొచ్చారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే బీజేపీలో చేరాను. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆయన చేస్తున్న కృషి నాకు ప్రేరణగా నిలిచింది” అని ఆమని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావడం తనకు కొత్త అయినప్పటికీ, ప్రజలతో నేరుగా అనుసంధానమై పనిచేయాలనే ఆశయం ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలంగా దూకుడు తగ్గించిన బీజేపీ, ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ప్రజల్లో మరింత చేరువ కావాలనే లక్ష్యంతో పార్టీ అడుగులు వేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో విజయశాంతి, జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి ప్రముఖులను పార్టీలోకి తీసుకురావడం, అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతల భేటీలు, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి నిర్ణయాలు ఈ వ్యూహానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
అయితే సినీ ప్రముఖుల రాజకీయ ప్రయాణం ఎప్పుడూ విజయవంతమేనని చెప్పలేమని రాజకీయ పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. విజయశాంతి తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్సీ కావడం ఇందుకు తాజా ఉదాహరణ. అయినప్పటికీ, బీజేపీ మాత్రం సినీ గ్లామర్‌కు ఉన్న ప్రజాదరణను పూర్తిగా వినియోగించుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆమని బాటలోనే మరికొందరు నటీనటులు కూడా త్వరలో బీజేపీలో చేరే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఇది రాబోయే ఎన్నికల ముందు బీజేపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే.