Yoga: ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం.. యోగాను జీవనశైలిగా మార్చుకోవాలి.. హోంమంత్రి అనిత!
Yoga: ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
విశాఖలో ఘనంగా యోగాంధ్ర.. ఆరోగ్య సందేశం ఇచ్చిన హోంమంత్రి..
మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరం: హోంమంత్రి అనిత..
విశాఖపట్నం: ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులోని సాగరిక ఫంక్షన్ హాలులో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. వాస్తవానికి ఆర్కే బీచ్లో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని భారీ వర్షాల కారణంగా సాగరిక ఫంక్షన్ హాలుకు మార్చినా, ప్రజల ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద అని అన్నారు. ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు కోసం యోగా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్, డీఎఫ్వో రవీందర్ ధామా, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
యోగా అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ సంస్థల సభ్యులు, విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సామూహిక యోగాసనాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు "యోగ పక్షోత్సవాలు" నిర్వహించినట్లు హోంమంత్రి తెలిపారు.
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ శాఖలు, పోలీసు విభాగం సమన్వయంతో యోగా కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి యోగాను ప్రజలకు మరింత చేరువ చేశామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా యోగా పట్ల పెరుగుతున్న ఆదరణ భారతీయ సంస్కృతికి గర్వకారణమని అన్నారు. యోగా గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుత ఒత్తిడితో కూడిన జీవన విధానంలో యోగా, ధ్యానం చాలా అవసరమని హోంమంత్రి అనిత చెప్పారు. ముఖ్యంగా చిన్నారులు, యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగా సహాయపడుతుందని అన్నారు.
యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనసుకు ప్రశాంతతను అందించే సాధనమని వివరించారు. ప్రతి వయస్సు వారు తమ జీవనశైలిలో యోగాను భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు.
గత ఏడాది విశాఖపట్నంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మూడు లక్షల మందికి పైగా పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. ఈ ఘనతలో భాగస్వాములైన విశాఖ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్రంలో యోగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటుగా మార్చుకుని ఆరోగ్యవంతమైన జీవితం వైపు అడుగులు వేయాలని హోంమంత్రి పిలుపునిచ్చారు.
Tags
Be the first to react