న్యూజిలాండ్‌లో తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఆ క్రమంలో “మాటా” (మదర్ ఆంధ్రా తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో న్యూజిలాండ్ దేశంలోని బార్స్ పార్క్ హాల్‌లో సాంస్కృతిక సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే రాథకృష్ణ ప్రసాద్ ప్రధాన అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు భాష, సాంస్కృతిక సంపదను ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టడం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ — “తెలుగు మనకు కేవలం భాష కాదు, ఆత్మగౌరవం. విదేశాల్లో నివసిస్తున్న మన తెలుగు సోదరులు తమ సంస్కృతిని, సంప్రదాయాలను ఇంత గొప్పగా కాపాడుకుంటూ కొనసాగించడం గర్వకారణం” అని అన్నారు. ఆయనతో పాటు కార్యక్రమానికి హాజరైన స్థానిక ప్రతినిధులు, మేటా అసోసియేషన్ సభ్యులు న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారతీయుల ఐక్యతను ప్రదర్శించారు. సాంస్కృతిక సమైక్యత, మానవ విలువల పరిరక్షణ లక్ష్యంగా మాటా అసోసియేషన్ తీసుకుంటున్న ప్రయత్నాలను ఎమ్మెల్యే ప్రశంసించారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అభివృద్ధి కార్యక్రమాలను కూడా రాధాకృష్ణ ప్రసాద్ ప్రస్తావించారు. ప్రజలతో కలసి ఉండే నాయకత్వం వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజం గౌరవం పొందుతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని సూచించారు. “మీ బంధం మాతృభూమితో ఎప్పటికీ చెదరకూడదు. మీ సహకారం రాష్ట్రానికి అవసరం” అని ఆయన అన్నారు.
కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాలకళాకారులు నాట్యాలు, పాటలతో ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలో న్యూజిలాండ్ రాజకీయ ప్రతినిధులు, స్థానిక అధికారులు పాల్గొని దీపప్రజ్వలన చేశారు. తెలుగు భాష, సాహిత్యం, కళలను విదేశాల్లో వ్యాప్తి చేస్తున్న మాటా అసోసియేషన్ అధ్యక్షులు మరియు సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. చివరగా మాటా అధ్యక్షులు మరియు నిర్వాహకులు రాధాకృష్ణ ప్రసాద్ గారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమం భారతీయ సమాజం సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.