దిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ దృశ్యాల్లో హ్యుందాయ్ ఐ20 కారును ఘటనకు మూడు గంటల ముందు పార్క్ చేసినట్లు కనిపిస్తోంది. హెచ్‌ఆర్ 26సీఈ 7674 నంబర్‌తో ఉన్న ఆ కారులోనే పేలుడు సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు. అనుమానితులు కారులోనే ఉన్నారని, ఎవరూ కిందకు దిగలేదని పోలీసులు తెలిపారు.
దర్యాప్తు బృందాలు కారును నడిపిన వ్యక్తి వైద్యుడైన మహ్మద్ ఉమర్ అని భావిస్తున్నాయి. ఇతడికి ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. పేలుడు చోటుచేసుకున్న వాహనంపై పలు ట్రాఫిక్ చలానాలు ఉన్నప్పటికీ అవన్నీ చెల్లించిన రికార్డులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం అమ్మోనియం నైట్రేట్ డిటోనేటర్లను ఉపయోగించి ఈ పేలుడు జరిపినట్లు అనుమానం వ్యక్తమైంది.
ఈ ఘటనపై కోట్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఉపా (UAPA) పేలుడు చట్టం మరియు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దిల్లీ పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ ఎన్ఎస్‌జీ బృందాలు ఘటనాస్థలంలో సాక్ష్యాలను సేకరిస్తున్నాయి. కారులో కొన్ని శరీరభాగాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం ఈరోజు ఉదయం జరిగింది. దిల్లీ పేలుడు ఘటనపై అంతర్గత భద్రతా విభాగాల సమన్వయం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధానమంత్రి మోదీ కూడా ఈ ఘటనపై వివరాలు సేకరించినట్లు సమాచారం. పోలీసులు ప్రస్తుతం పహర్‌గంజ్ దరియాగంజ్ ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.