భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడే దిశగా ఒక చారిత్రక ఒప్పందం కుదురుకోబోతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ మొదటి వారంలో భారత్ పర్యటనకు రానున్న సందర్భంగా, ఇరు దేశాలు మోబిలిటీ ప్యాక్ట్ (వలస ఒప్పందం)పై సంతకాలు చేయనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారతీయులకు చట్టబద్ధమైన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక పెద్ద ముందడుగుగా పరిగణించబడుతోంది.
రష్యాలో ప్రస్తుతం నిర్మాణ, ఇంజనీరింగ్, టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపధ్యంలో రష్యా ప్రభుత్వం భారత నిపుణులను పెద్ద ఎత్తున ఆహ్వానించడానికి సిద్ధమైంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే సుమారు 70,000 మంది భారతీయులు రష్యాలో అధికారికంగా పనిచేయగల అవకాశముంది. దీంతో రష్యా అభివృద్ధి ప్రాజెక్టులకు మానవ వనరులు లభించగా, భారత యువతకు అంతర్జాతీయ వేదికపై ఉపాధి దొరుకుతుంది.
ఇండియన్ బిజినెస్ అలయన్స్ (IBA) ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ, ఇది ఇరు దేశాలకూ లాభదాయకమని ప్రకటించింది. సంస్థ అధ్యక్షుడు సమ్మీ మనోజ్ కొత్వానీ మాట్లాడుతూ, “భారత్ ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికశక్తిని కలిగి ఉంది. అదే సమయంలో రష్యా పారిశ్రామిక విస్తరణ దశలో ఉంది. ఈ ఒప్పందం రష్యా అవసరాలను తీర్చడమే కాకుండా భారతీయులకు గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు అందిస్తుంది” అని తెలిపారు.
గతంలో కొందరు భారతీయులు నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఐబీఏ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. రష్యా వెళ్లే కార్మికులకు అవగాహన కార్యక్రమాలు, భాషా శిక్షణ, నైతిక నియామక విధానాలపై అవగాహన కల్పించనుంది. ఇరు దేశాల ప్రభుత్వాలతో కలిసి పారదర్శక నియామక ప్రక్రియను ఏర్పాటు చేయడానికి ఐబీఏ కృషి చేస్తోంది.
మాస్కోలోని భారత రాయబార కార్యాలయం కూడా రష్యాలో పనిచేసే భారతీయుల సంక్షేమంపై దృష్టి పెట్టనుంది. ఉద్యోగుల భద్రత, నివాస సౌకర్యాలు, వీసా సహాయం వంటి అంశాలలో పూర్తి మద్దతు ఇవ్వనుంది. ఈ ఒప్పందం ద్వారానే రష్యాలో భారతీయుల స్థానం మరింత బలపడుతుందని, అలాగే భారత్-రష్యా స్నేహబంధం కొత్త మైలురాయిని చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.