యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అంతరిక్ష ప్రయాణాల్లో అత్యంత పెద్ద సమస్య అయిన ఆహార సరఫరాకు వినూత్న పరిష్కారం కనుగొనే దిశగా కీలక ప్రయత్నం ప్రారంభించింది. దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాల్లో లేదా చంద్రుడు, మార్స్ పై భవిష్యత్తులో అక్కడే ఆహారం ఉత్పత్తి చేసే వ్యవస్థ అవసరం అనే భావనతో ESA "HOBI-WAN" అనే ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో అంతరిక్షంలో అందుబాటులో ఉండే గాలి, నీరు, విద్యుత్ మరియు అస్ట్రోనాటు మూత్రంలో ఉన్న యూరియా ఉపయోగించి ప్రోటీన్‌ను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రయోగంలో ఫిన్లాండ్‌కు చెందిన Solar Foods అనే కంపెనీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. వారు ఇప్పటికే భూమిపైనే “Solein” అనే ప్రోటీన్ పౌడర్‌ను తయారు చేశారు. ఇది గాల్లో ఉండే కార్బన్ డయాక్సైడ్, సూక్ష్మజీవులు మరియు విద్యుత్ సహాయంతో తయారయ్యే పదార్థం. భూమిపై ఈ ప్రక్రియలో నైట్రోజన్ కోసం అమోనియాను ఉపయోగిస్తారు. అయితే అంతరిక్షంలో అమోనియా అందుబాటులో ఉండదని, అందుకు ప్రత్యామ్నాయంగా మూత్రంలో ఉండే యూరియాను నైట్రోజన్ మూలంగా వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదే ఆలోచనను ఇప్పుడు అంతరిక్షంలో పరీక్షించడానికి ESA సిద్ధమవుతోంది.
ESA చీఫ్ ఎక్స్‌ప్లోరేషన్ సైంటిస్ట్ అంజెలిక్ వాన్ ఒంబెర్గెన్ మాట్లాడుతూ, దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాలకు స్వయం సమృద్ధి అత్యంత ముఖ్యమని తెలిపారు. చంద్రుడు లేదా మంగళగ్రహం వంటి ప్రదేశాలలో మనుషులు నివసించగలగాలంటే, అక్కడే ఆహారం, నీరు, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థలు ఉండాలి. భూమి నుండి వరుసగా రవాణా చేయడం ఖరీదైనదే కాకుండా ప్రమాదకరమని కూడా వారు స్పష్టం చేశారు. అందుకే వ్యర్థ పదార్థాలను కూడా ఉపయోగించి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకునే ఈ ప్రయోగం భవిష్యత్తు అంతరిక్ష జీవనానికి కీలక మలుపుగా భావిస్తున్నారు.
అయితే ఈ ప్రక్రియ అంతరిక్షంలో భూమిమీదలానే పని చేస్తుందా లేదా అన్నది ఇప్పటివరకు స్పష్టంగా లేదు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం వల్ల ద్రవాలు మరియు వాయువుల ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సూక్ష్మజీవుల పెరుగుదలపై, పోషక ద్రవాలు వాటికి చేరే విధానంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతరిక్షంలో ఈ వ్యవస్థను సురక్షితంగా, శుభ్రంగా నిర్వహించడం మరో పెద్ద సవాలు అని Solar Foods సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టు లూకాడెన్ తెలిపారు. తయారయ్యే ఆహారం astronauts ఆరోగ్యానికి పూర్తిగా సురక్షితమా? పౌష్టిక విలువలు పక్కాగా కలిగి ఉందా? అన్నవి పరీక్షల్లో నిరూపించాలి.
ఈ ప్రయోగం విజయవంతమైతే, అంతరిక్ష ప్రయాణాలకు ఆహారం రవాణా చేసే అవసరం గణనీయంగా తగ్గిపోతుంది. చంద్రుడు లేదా మంగళంపై ఉన్న కాలనీలు బయట సహాయం లేకుండానే ఆహారం ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ టెక్నాలజీ భవిష్యత్తులో భూమిపై కూడా ఆహార కొరత సమస్యలకు పరిష్కారం తీసుకురాగలదు. వాతావరణ పరిస్థితులు, సాగు భూమి లోపం వంటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో గాలి, విద్యుత్ సహాయంతో ప్రోటీన్ తయారీ ఒక విప్లవం కావచ్చు.
మొత్తం మీద ESA చేపట్టిన ఈ ప్రయోగం అంతరిక్షంలోని జీవితానికి కాలనీలకు మరియు భవిష్యత్తు మానవ జీవన విధానానికి ఓ మార్గదర్శకమైన అంశంగా నిలుస్తోంది. గాలి నుంచి ఆహారం, వ్యర్థ మూత్రం నుంచి ప్రోటీన్ ఉత్పత్తి చేయడం ఇవి వినడానికి వింతగా అనిపించినా ఇవే రాబోయే తరాల అంతరిక్ష జీవనానికి పునాది వేయనున్నాయి.