మన రోజువారీ ఆహారంలో చక్కెర చాలా సాధారణ విషయంలా కనిపిస్తుంది. టీ తాగినా కాఫీ తాగినా జ్యూస్, బిస్కెట్లు, చాక్లెట్లు తిన్నా… చక్కెర తప్పదు. అయినప్పటికీ, మనం గమనించని విషయం ఒకటుంది చక్కెర ఎక్కువైతే అది నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిపుణుల ప్రకారం మనం చక్కెర తీసుకోవడం తగ్గిస్తే శరీరం లోపల అద్భుత మార్పులు వస్తాయి. ఈ మార్పుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపించడం మొదలవుతుంది.
అధిక చక్కెర వాడకం వల్ల ఊబకాయం, రక్తపోటు, ఫ్యాటీ లివర్, మధుమేహం, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. మన శరీరంలో ఇన్సులిన్‌కు ప్రతిఘటన పెరిగినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయులు క్రమంగా తప్పిపోతాయి. ఇదే డయాబెటిస్‌కు ప్రధాన కారణం. మనం చక్కెర తీసుకోవడం ఆపినప్పుడు, శరీరం నిల్వ ఉంచిన కొవ్వును ఎనర్జీగా మార్చడం ప్రారంభిస్తుంది. దీని వల్ల బరువు తగ్గడం మొదలవుతుంది.
చక్కెర తగ్గించడం వల్ల వచ్చే తొలి మార్పుల్లో ఒకటి మూడ్ మరియు మెదడు పనితీరు మెరుగుదల. ఎక్కువ చక్కెర తీసుకుంటే రక్తంలో షుగర్ ఒక్కసారిగా పెరిగి వెంటనే పడిపోతుంది. అందుకే చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం తిన్న తర్వాత కొద్దిసేపటికే అలసట, చిరాకు, దిమ్మతిరిగినట్టు అనిపించడం మొదలవుతుంది. కానీ తీపిని ఆపేస్తే రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది.
ఇంకో ముఖ్యమైన లాభం చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అధిక చక్కెర శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచుతుంది. ఇది మొటిమలు, స్కిన్ డల్ గా మారడం, ముడతలు పుట్టడం వంటి సమస్యలకు కారణం అవుతుంది. చక్కెర తినడం తగ్గించిన కొద్దిరోజుల్లోనే చర్మం మెరిసేలా మారుతుంది, ముడతలు తగ్గుతాయి. చక్కెర తగ్గిస్తే దంత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ప్రాకృతిక చక్కెరలు (పండ్లు, పాలలో ఉండే చక్కెర) శరీరానికి హితం. కాని ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్, కేక్, బిస్కెట్లు, ప్యాకెట్ జ్యూస్‌లలో ఉండే యాడెడ్ షుగర్ శరీరానికి హానికరం. ఇవి పోషకాలు ఇవ్వకుండా కేవలం క్యాలరీలే ఇస్తాయి. అమెరికా FDA ప్రకారం, రోజుకు 50 గ్రాములకంటే ఎక్కువ యాడెడ్ షుగర్ తీసుకోవద్దని సూచన.
తీపి ఆపినవెంటనే నిద్ర నాణ్యత కూడా మెరుగవుతుంది. రాత్రి ఎక్కువ చక్కెర తీసుకుంటే మెదడు ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది నిద్ర పడటానికి ఇబ్బంది అవుతుంది. చక్కెర తగ్గిస్తే శరీరం నిద్రకు సులభంగా సిద్ధమవుతుంది.
మొత్తం మీద చక్కెరను తగ్గించడం వలన మన శరీరం డిటాక్స్ అవుతుంది. బరువు తగ్గుతుంది. చర్మం మెరిసిపోతుంది. నిద్ర మెరుగవుతుంది. మనసు ప్రశాంతమవుతుంది. తాత్కాలికంగానైనా ప్రయత్నించినా శరీరానికి మంచి జరగడం ఖాయం. ఇది కేవలం అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్య నిత్యం ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తీసుకోవాల్సిందిగా సూచన.