లిథియం బ్యాటరీ వ్యర్థాల ఎగుమతిపై కేంద్రం నిషేధం.. తక్షణమే అమల్లోకి కొత్త నిబంధనలు!
India Bans Export of Lithium-Ion Battery: భారత్‌లో లిథియం అయాన్ బ్యాటరీల రీసైక్లింగ్ రంగానికి కీలకమైన మార్పు చోటుచేసుకుంది. లిథియం అయాన్ బ్యాటరీల నుంచి సేకరించే బ్లాక్ మాస్‌తో పాటు కొన్ని రకాల బ్యాటరీ వ్యర్థాలు, తుక్కు ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు నవంబర్ 10న విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (DGFT) కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ నిర్ణయం తీసుకోగా, కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
లిథియం బ్యాటరీ వ్యర్థాల ఎగుమతిపై కేంద్రం నిషేధం.. తక్షణమే అమల్లోకి కొత్త నిబంధనలు..
భారత్‌లో లిథియం బ్యాటరీ బ్లాక్ మాస్ ఎగుమతులు నిషేధం.. ఎందుకో తెలుసా?..
భారత్‌లో లిథియం అయాన్ బ్యాటరీల రీసైక్లింగ్ రంగానికి కీలకమైన మార్పు చోటుచేసుకుంది. లిథియం అయాన్ బ్యాటరీల నుంచి సేకరించే బ్లాక్ మాస్‌తో పాటు కొన్ని రకాల బ్యాటరీ వ్యర్థాలు, తుక్కు ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు నవంబర్ 10న విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (DGFT) కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ నిర్ణయం తీసుకోగా, కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం ప్రైమరీ సెల్స్, ప్రైమరీ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ అక్యుమ్యులేటర్లకు సంబంధించిన వ్యర్థాలు, తుక్కు ఎగుమతి విధానంలో మార్పులు చేశారు. ముఖ్యంగా వాడి పడేసిన ప్రైమరీ సెల్స్, ప్రైమరీ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ అక్యుమ్యులేటర్లను వేరు చేయకుండా కలిపి ఉంచిన స్థితిలో ఉండి, వాటిలో సీసం (Lead), కాడ్మియం (Cadmium), పాదరసం (Mercury) లేని వాటి ఎగుమతులను ఇకపై అనుమతించరు. ఇప్పటివరకు ఈ తరహా వ్యర్థాల ఎగుమతులకు ఉన్న 'ఫ్రీ' కేటగిరీని తొలగించి, 'ప్రొహిబిటెడ్' కేటగిరీలోకి మార్చారు.
ఈ నిషేధం పరిధిలోకి లిథియం అయాన్ బ్యాటరీ బ్లాక్ మాస్‌ను కూడా తీసుకొచ్చారు. పాతబడిన లేదా వినియోగానికి పనికిరాని లిథియం అయాన్ బ్యాటరీలను రీసైక్లింగ్ చేసే సమయంలో బ్లాక్ మాస్ అనే పదార్థం వెలువడుతుంది. ఇందులో లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి అత్యంత విలువైన లోహాలు ఉంటాయి. వీటిని శుద్ధి చేసి తిరిగి బ్యాటరీల తయారీలో ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, పునరుత్పాదక ఇంధన రంగాల విస్తరణతో ఈ పదార్థానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యత పెరుగుతోంది.
గతంలో నిర్దిష్ట రకాల బ్యాటరీ వ్యర్థాలు, బ్లాక్ మాస్‌ను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించేది. అవి 'ఫ్రీ ఎగుమతి' విధానం కింద ఉండటంతో ఎగుమతిదారులు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఇతర దేశాలకు పంపించేవారు. అయితే తాజాగా తీసుకొచ్చిన సవరణతో ఈ వెసులుబాటు తొలగిపోయింది. ఇకపై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నోటిఫికేషన్ పరిధిలోకి వచ్చే బ్యాటరీ వ్యర్థాలు, బ్లాక్ మాస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతి ఉండదు.
అయితే ఈ మార్పులకు సంబంధించి విదేశీ వాణిజ్య విధానం–2023లోని పేరా 1.05 కింద పేర్కొన్న పరివర్తన ఏర్పాట్లు (Transitional Arrangements) వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. అంటే కొత్త విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సంబంధిత ఎగుమతి లావాదేవీలకు ఈ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలు, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల విస్తరణ కూడా జరుగుతోంది. దీంతో పాత బ్యాటరీల సేకరణ, వాటి నుంచి విలువైన లోహాలను తిరిగి వెలికితీసే రీసైక్లింగ్ పరిశ్రమకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో బ్యాటరీ వ్యర్థాలు, బ్లాక్ మాస్ ఎగుమతులపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం భారత బ్యాటరీ రీసైక్లింగ్, ముడిసరుకు వినియోగ రంగాలపై ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా బ్యాటరీల్లో ఉపయోగించే కీలక లోహాలను దేశీయంగా తిరిగి వినియోగించుకునే అంశానికి ఈ నిర్ణయం ప్రాధాన్యతను తీసుకొచ్చింది.