శబరిమలలో వారికి నో ఎంట్రీ.. కేరళ ప్రభుత్వం, టీడీబీ స్పష్టీకరణ!

Sabarimala Temple News: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తి ప్రవేశానికి అనుమతి ఇవ్వడంపై వివాదం కొనసాగుతోంది. తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ ప్రభుత్వం కీలక అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించింది. ఆమెకు ఆలయంలో దర్శనం కల్పించాలన్న అభ్యర్థనను ప్రభుత్వం వ్యతిరేకించింది.

Kerala Government Opposes Transgender Entry in Sabarimala Temple
Kerala Government Opposes Transgender Entry in Sabarimala Temple
  • శబరిమలలో ట్రాన్స్‌జెండర్ మహిళ ప్రవేశాన్ని కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది.
  • సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆలయ సంప్రదాయాలే ముఖ్యమని స్పష్టం చేసింది.

Sabarimala Temple News: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తి ప్రవేశానికి అనుమతి ఇవ్వడంపై వివాదం కొనసాగుతోంది. తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ ప్రభుత్వం కీలక అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించింది. ఆమెకు ఆలయంలో దర్శనం కల్పించాలన్న అభ్యర్థనను ప్రభుత్వం వ్యతిరేకించింది.

సర్టిఫికెట్లు ఉంటేనే దర్శనానికి అనుమతి?

సదరు వ్యక్తి లింగ గుర్తింపును నిర్ధారించే సరైన వైద్య పరీక్షలు, చట్టబద్ధమైన అధికార సంస్థ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు లేకుండా దర్శనానికి అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ విషయంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) తీసుకున్న వైఖరినే తాము సమర్థిస్తున్నట్లు స్పష్టం చేసింది.

హరజుదారురాలి శారీరక, జీవ సంబంధిత లక్షణాలను పరిశీలించి ఆమె ట్రాన్స్‌జెండర్ వ్యక్తా? మహిళా? అనే విషయాన్ని నిర్ధారించే అధికారం తమకు లేదని దేవస్వం బోర్డు ఇప్పటికే కోర్టుకు వివరించింది. సరైన ధ్రువీకరణ లేకుండా ఆలయంలోకి అనుమతిస్తే అక్కడి సంప్రదాయాలు, ఆచారాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంది.

సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చే వరకు సంప్రదాయాలే ముఖ్యం

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం, ఇతర ప్రవేశ నిబంధనలు, మతపరమైన ఆచారాలకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం సుప్రీంకోర్టులోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఆలయ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత దేవస్వం బోర్డుపై ఉందని ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల పిటిషనర్ కోరిన ఉపశమనాలు కల్పించలేమని, ఆమె పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును కోరింది.

గతంలో రెండుసార్లు అయ్యప్ప దర్శనం

తమిళనాడుకు చెందిన సత్యశ్రీ శర్మిళ రహేమతలి అనే ట్రాన్స్‌జెండర్ మహిళ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తాను అయ్యప్ప స్వామి భక్తురాలినని, అవసరమైన సంప్రదాయాలను పాటిస్తూ తీర్థయాత్ర చేయడానికి ట్రాన్స్‌జెండర్ వర్గానికి అనుమతి కల్పించాలని కోరారు. ఈ ఏడాది జనవరి 3, ఏప్రిల్ 15 తేదీల్లో తాను శబరిమల ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే ఆగస్టు 20న మరోసారి దర్శనానికి వెళ్తుండగా పంబ గణపతి ఆలయం సమీపంలో పోలీసులు సాధారణ తనిఖీల సమయంలో ఆమెను అడ్డుకున్నారు. అనంతరం ఆగస్టు 26న తిరువోణం సందర్భంగా దర్శనానికి అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులు, దేవస్వం బోర్డు అధికారులకు వినతులు సమర్పించారు. ఈ వ్యవహారం ఇప్పుడు కేరళ హైకోర్టులో చర్చనీయాంశంగా మారింది.

Tags

Be the first to react

Latest