దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్ పంజాగుట్ట!

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో సరికొత్త సాంకేతిక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. పోలీస్ సేవలను మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నారు.

India's First AI Police Station in Hyderabad
India's First AI Police Station in Hyderabad
  • హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నారు.
  • ఫిర్యాదుల నమోదు నుంచి దర్యాప్తు, ఛార్జిషీట్ల తయారీ వరకు ఏఐ సాంకేతికతను ఉపయోగించనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో సరికొత్త సాంకేతిక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. పోలీస్ సేవలను మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నారు.

డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో డీజీపీ స్వయంగా ఈ కొత్త విధానాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఫిర్యాదుల స్వీకరణ నుంచి దర్యాప్తు వరకు ఏఐ సేవలు

ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లలో మానవీయంగా నిర్వహించే అనేక పనులకు ఇకపై ఏఐ సాంకేతికతను అనుసంధానించనున్నారు. ఫిర్యాదుల స్వీకరణ, ఎఫ్‌ఐఆర్ నమోదు, కేసు డైరీల నిర్వహణ, దర్యాప్తు నివేదికల తయారీతో పాటు ఛార్జిషీట్ల రూపకల్పనలోనూ ఏఐ సహాయం తీసుకోనున్నారు. దీనివల్ల పోలీసుల పనిభారం తగ్గడంతో పాటు కేసుల నిర్వహణ మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది.

10 భాషల్లో ఫిర్యాదులు చేసే అవకాశం

ఈ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే ప్రత్యేకంగా 'సేతు' కియోస్క్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రజలు దాదాపు 10 భాషల్లో తమ సమస్యలను, ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఏఐ సాంకేతికత ఫిర్యాదులను స్థానిక భాషలోకి అనువదించి సంబంధిత అధికారులకు క్షణాల్లో పంపిస్తుంది. దీంతో భాష తెలియక ఇబ్బందులు ఎదుర్కొనే ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా పోలీస్ సేవలు సులభంగా అందనున్నాయి.

నేరాల నియంత్రణకు స్మార్ట్ టెక్నాలజీ

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ రద్దీ, హాస్టళ్లు, వాణిజ్య సంస్థలు, నేరాల నమోదుకు సంబంధించిన సమాచారాన్ని ఏఐ విశ్లేషించనుంది. ఈ వివరాల ఆధారంగా నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించడం, బ్లూకోల్ట్స్ సిబ్బంది విధులను సమర్థంగా నిర్వహించడం, పెట్రోలింగ్‌ను మెరుగుపరచడం సాధ్యమవుతుంది.

పోలీసులకు ప్రత్యేక శిక్షణ

కొత్త సాంకేతిక విధానాలను సమర్థంగా వినియోగించుకునేందుకు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు పనితీరును పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా ఏఐ విధానాన్ని విస్తరించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బుధవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న ఆధునికీకరణ పనులను పరిశీలించడంతో పాటు ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

Tags

Be the first to react

Latest