కొత్త 7 సీటర్ SUVలు వచ్చేస్తున్నాయ్.. టాటా, టయోటా, మహీంద్రా నుంచి 5 అదిరిపోయే కార్లు!
5 New 7-Seater SUVs Coming to India: భారత్‌లో 7 సీటర్ ఎస్‌యూవీలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. కుటుంబంతో కలిసి ప్రయాణించేందుకు ఎక్కువ స్థలం, సౌకర్యవంతమైన సీటింగ్, మెరుగైన భద్రతా ఫీచర్లు కోరుకునే వారు ఈ కార్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా రాబోయే ఆరు నెలల నుంచి 2027 వరకు టాటా, రెనో, టయోటా, నిస్సాన్, మహీంద్రా కంపెనీల నుంచి ఐదు కొత్త 7 సీటర్ ఎస్‌యూవీలు భారత మార్కెట్లో సందడి చేయనున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో పాటు డీజిల్, పెట్రోల్, హైబ్రిడ్ మోడళ్లు కూడా ఉండనున్నాయి. వాటి ప్రత్యేకతలు, అంచనా ధరలు, విడుదల వివరాలు తెలుసుకుందాం.
7 సీటర్ SUV కొనాలనుకుంటున్నారా? 2027లో మార్కెట్లోకి రానున్న 5 కొత్త కార్లు ఇవే..
ఫార్చ్యూనర్ కొత్త మోడల్, స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్.. 2027లో SUV మార్కెట్లో భారీ మార్పులు..
భారత్‌లో 7 సీటర్ ఎస్‌యూవీలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. కుటుంబంతో కలిసి ప్రయాణించేందుకు ఎక్కువ స్థలం, సౌకర్యవంతమైన సీటింగ్, మెరుగైన భద్రతా ఫీచర్లు కోరుకునే వారు ఈ కార్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా రాబోయే ఆరు నెలల నుంచి 2027 వరకు టాటా, రెనో, టయోటా, నిస్సాన్, మహీంద్రా కంపెనీల నుంచి ఐదు కొత్త 7 సీటర్ ఎస్‌యూవీలు భారత మార్కెట్లో సందడి చేయనున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో పాటు డీజిల్, పెట్రోల్, హైబ్రిడ్ మోడళ్లు కూడా ఉండనున్నాయి. వాటి ప్రత్యేకతలు, అంచనా ధరలు, విడుదల వివరాలు తెలుసుకుందాం.
టాటా సఫారీ ఈవీ (Tata Safari.ev)
ఈ జాబితాలో మొదటగా చెప్పుకోవాల్సింది టాటా మోటార్స్ తీసుకొస్తున్న సఫారీ ఈవీ. 2027 జనవరిలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టెస్ట్ మోడళ్లు పలుమార్లు భారత రోడ్లపై కనిపించాయి. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది టాటా ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా నిలవనుంది. ఆరు సీట్లు, ఏడు సీట్ల ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
డిజైన్ పరంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న డీజిల్ సఫారీని పోలి ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనానికి ప్రత్యేకమైన మార్పులు ఇందులో కనిపించనున్నాయి. మూసివేసిన ఫ్రంట్ గ్రిల్, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, ప్రత్యేకమైన ఈవీ బ్యాడ్జింగ్ వంటి అంశాలు ఉండవచ్చు. ఇంటీరియర్‌లో మూడు స్క్రీన్లతో కూడిన డ్యాష్‌బోర్డ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, లెవల్-2 ADAS వంటి అధునాతన ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.
బ్యాటరీ విషయానికి వస్తే హారియర్ ఈవీలో ఉపయోగిస్తున్న 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లను ఇందులోనూ అందించవచ్చని అంచనా. అంతేకాకుండా 80 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కూడా టాటా ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆటోమొబైల్ నివేదికలు చెబుతున్నాయి. రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్లు అందుబాటులోకి రావచ్చు. హారియర్ ఈవీ గరిష్ఠంగా 627 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ అందిస్తోంది. సఫారీ ఈవీ రేంజ్‌పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.20 లక్షల నుంచి రూ.32 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.
రెనో బోరియల్ (Renault Boreal)
రెనో కంపెనీ కూడా భారత మార్కెట్ కోసం కొత్త త్రీ-రో ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఇటీవల విడుదలైన డస్టర్ ఆధారంగా ఈ కొత్త మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లలో రెనో ఉపయోగిస్తున్న బోరియల్ (Boreal) పేరుతో ఈ కారు పరిచయం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, భారత్‌లో ఇదే పేరు కొనసాగుతుందా లేదా అనేది కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ఇటీవల లడఖ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఈ ఎస్‌యూవీని పరీక్షిస్తుండగా భారీ కవరింగ్‌తో ఉన్న టెస్ట్ మోడల్ కనిపించింది. బాక్సీ డిజైన్, ఎత్తైన బానెట్, వెడల్పైన వీల్ ఆర్చ్‌లు, రూఫ్ రైల్స్ దీని ప్రత్యేకతలుగా కనిపిస్తున్నాయి. టెస్ట్ మోడల్‌లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, పెద్ద రియర్ క్వార్టర్ గ్లాస్ కూడా గుర్తించారు.
మెకానికల్‌గా ఈ ఎస్‌యూవీ రెనో RGMP ప్లాట్‌ఫామ్‌పై రూపొందే అవకాశం ఉంది. డస్టర్‌లో ఉన్న 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా అందించవచ్చని అంచనా. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండవచ్చు. భారత్‌లో ఈ ఎస్‌యూవీ 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. ధరల వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
నెక్స్ట్ జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner)
భారతదేశంలో ఫుల్‌సైజ్ ఎస్‌యూవీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టయోటా ఫార్చ్యూనర్‌కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ పాపులర్ ఎస్‌యూవీకి టయోటా భారీ మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది.
కొత్త తరం ఫార్చ్యూనర్‌ను 2026 డిసెంబర్ 1న దక్షిణాఫ్రికాలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లో మాత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో ఈ వాహనం టెస్టింగ్‌లో కనిపించింది. తాజా హైలక్స్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొందిన కొత్త ఫ్రంట్ లుక్ ఇందులో ఉండనుంది.
ముందుభాగంలో సన్నని ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, పెద్ద గ్రిల్, మరింత దృఢంగా కనిపించే బంపర్ ఉండవచ్చు. ఇంటీరియర్‌లోనూ కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు అందించే అవకాశం ఉంది.
ఇంజిన్ పరంగా ప్రస్తుతం ఉన్న 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కొనసాగించవచ్చని అంచనా. అలాగే 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉండవచ్చు. 4x2, 4x4 వేరియంట్లు కొనసాగనున్నాయి. కొత్త ఫార్చ్యూనర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.38 లక్షల నుంచి రూ.52 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.
నిస్సాన్ 7 సీటర్ ఎస్‌యూవీ (Nissan 7-Seater SUV)
భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు నిస్సాన్ కూడా కొత్త 7 సీటర్ ఎస్‌యూవీని తీసుకొస్తోంది. ఇటీవల పరిచయమైన టెక్టాన్ మోడల్‌కు ఉపయోగిస్తున్న CMF-B ప్లాట్‌ఫామ్‌పైనే ఈ కొత్త ఎస్‌యూవీని రూపొందించనున్నారు. అయితే ఇది టెక్టాన్‌కు కేవలం పొడవైన వెర్షన్ మాత్రమే కాదని, పూర్తిగా భిన్నమైన ఉత్పత్తిగా ఉంటుందని నిస్సాన్ స్పష్టం చేసింది.
ఇటీవల ఈ కొత్త ఎస్‌యూవీ టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇందులో పొడవైన రియర్ క్వార్టర్ ప్యానెల్, పెద్ద రియర్ క్వార్టర్ గ్లాస్ ప్రత్యేకంగా కనిపించాయి. ముందు భాగంలో ఇన్వర్టెడ్ L ఆకారంలో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఉండనున్నాయి. వెనుకవైపు బూమరాంగ్ ఆకారంలో ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్‌ను మందపాటి లైట్ బార్‌తో అనుసంధానించే డిజైన్ కనిపిస్తోంది.
ఇంటీరియర్‌లో 5+2 సీటింగ్ లేఅవుట్ ఉండవచ్చని సమాచారం. ఇంజిన్ విషయానికి వస్తే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. దీనికి ఆరు స్పీడ్ మాన్యువల్, ఆరు స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండవచ్చు. ఈ ఎస్‌యూవీ 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎక్స్‌షోరూమ్ ధర రూ.18 లక్షల నుంచి రూ.22 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.
మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ (Mahindra Scorpio-N Facelift)
ఈ జాబితాలో చివరిగా చెప్పుకోవాల్సిన మోడల్ మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్. ఇప్పటికే భారత మార్కెట్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ఎస్‌యూవీకి మరిన్ని ఆధునిక హంగులు అద్దేందుకు మహీంద్రా సిద్ధమవుతోంది. ఇటీవల అప్‌డేటెడ్ స్కార్పియో-ఎన్ టెస్ట్ మోడల్ తొలిసారిగా రోడ్లపై కనిపించింది.
ఈ టెస్ట్ మోడల్‌లో ప్రధానంగా ముందు భాగంలో చేసిన మార్పులు ఆసక్తి రేపుతున్నాయి. మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొందినట్లుగా కొత్త ఫ్రంట్ లుక్ కనిపిస్తోంది. సన్నని హెడ్‌ల్యాంప్స్, పెద్ద గ్రిల్, కొత్త డిజైన్ బంపర్లు ఇందులో ఉండవచ్చని అంచనా.
క్యాబిన్‌లోనూ ఆధునిక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మరిన్ని అదనపు ఫీచర్లను అందించవచ్చు. ఇంజిన్ పరంగా ప్రస్తుత మోడల్‌లోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లనే కొనసాగించే అవకాశం ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండవచ్చు. డీజిల్ ఇంజిన్‌తో వచ్చే 4WD వేరియంట్లు కూడా కొనసాగనున్నాయి. అయితే ఈ ఫేస్‌లిఫ్ట్ విడుదల తేదీ, ధరలను మహీంద్రా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
7 సీటర్ ఎస్‌యూవీ కొనాలనుకునేవారికి ఆసక్తికరమైన సమయం
మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో భారత 7 సీటర్ ఎస్‌యూవీ మార్కెట్లో పోటీ మరింత పెరగనుంది. టాటా సఫారీ ఈవీ రూపంలో ఎలక్ట్రిక్ ఆప్షన్ అందుబాటులోకి రానుండగా, టయోటా ఫార్చ్యూనర్ కొత్త తరంతో రానుంది. రెనో, నిస్సాన్ కొత్త త్రీ-రో ఎస్‌యూవీలతో పోటీలోకి దిగనున్నాయి. మరోవైపు మహీంద్రా స్కార్పియో-ఎన్‌ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతోంది.
అయితే ఇక్కడ పేర్కొన్న విడుదల తేదీలు, ఫీచర్లు, ధరలు ప్రస్తుత అంచనాలు, ఆటోమొబైల్ నివేదికల ఆధారంగా ఉన్నవే. కంపెనీలు అధికారికంగా ప్రకటించే సమయానికి వీటిలో మార్పులు ఉండవచ్చు. కాబట్టి వచ్చే ఆరు నెలల్లో కొత్త 7 సీటర్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ మోడళ్లపై ఓ కన్నేసి ఉంచడం మంచిది.
Tags
Be the first to react