విదేశీయులకు గుడ్‌న్యూస్.. భారత్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. 70 శాతం తగ్గనున్న పేపర్‌వర్క్!

India Overhauls Visa Rules: భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వైద్య చికిత్స కోసం వచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశ వీసా విధానాన్ని మరింత సరళీకృతం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) కీలక మార్పులను ప్రకటించింది. వీసా కేటగిరీల సంఖ్యను తగ్గించడంతో పాటు దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన వివరాలు, పత్రాల భారాన్ని కూడా భారీగా తగ్గించాలని నిర్ణయించింది. కొత్త విధానం అమల్లోకి వస్తే వీసా దరఖాస్తు ఫారాల్లోని వివరాల సంఖ్య 65 నుంచి 70 శాతం వరకు తగ్గనుంది. ఈ మార్పులన్నీ 2026 చివరి నాటికి అమల్లోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

India Overhauls Visa Rules
India Overhauls Visa Rules

ఇకపై భారత్ వీసా పొందడం మరింత ఈజీ.. 13 నుంచి 9కి తగ్గిన వీసా కేటగిరీలు..

భారత్ వీసా రూల్స్‌లో కీలక మార్పులు.. పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఊరట..

భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వైద్య చికిత్స కోసం వచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశ వీసా విధానాన్ని మరింత సరళీకృతం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) కీలక మార్పులను ప్రకటించింది. వీసా కేటగిరీల సంఖ్యను తగ్గించడంతో పాటు దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన వివరాలు, పత్రాల భారాన్ని కూడా భారీగా తగ్గించాలని నిర్ణయించింది. కొత్త విధానం అమల్లోకి వస్తే వీసా దరఖాస్తు ఫారాల్లోని వివరాల సంఖ్య 65 నుంచి 70 శాతం వరకు తగ్గనుంది. ఈ మార్పులన్నీ 2026 చివరి నాటికి అమల్లోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

13 నుంచి 9కి తగ్గిన వీసా కేటగిరీలు
ప్రస్తుతం భారత వీసా విధానంలో ఉన్న ప్రధాన కేటగిరీల సంఖ్యను 13 నుంచి 9కి తగ్గించారు. అలాగే 49 ఉప కేటగిరీలను 23కి కుదించారు. ఈ మార్పులకు ఆగస్టు 27న ఆమోదం లభించింది. అంతకుముందు 2025 అక్టోబర్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం వీసా కేటగిరీలను 22 నుంచి 13కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మరోసారి సమీక్షించి మొత్తం విధానాన్ని మరింత సరళంగా మార్చింది.

విదేశీయులు భారత్‌కు రావడానికి గల ప్రయోజనాలను బట్టి సరైన వీసాను ఎంచుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. పర్యాటకులు, వైద్య సేవలు పొందాలనుకునేవారు, విద్యార్థులు, పరిశోధకులు, పెట్టుబడిదారులు, వ్యాపార నిపుణులకు ప్రయాణ ప్రక్రియ సులభతరం కానుంది. అభివృద్ధి చెందిన దేశాల వీసా విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే ఈ మార్పులను ఖరారు చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

టూరిస్ట్ వీసా పేరు ఇక విజిటర్ వీసా
కొత్త విధానంలో ముఖ్యమైన మార్పు టూరిస్ట్ వీసా పేరును విజిటర్ వీసా (Visitor Visa)గా మార్చడం. ఇందులో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయాణాల కోసం రెండు రకాల కేటగిరీలను ప్రవేశపెట్టారు.

V-1 వీసా కింద 30 రోజుల పాటు చెల్లుబాటయ్యే మల్టిపుల్ ఎంట్రీ సదుపాయం కల్పిస్తారు. అంటే ఈ వ్యవధిలో అర్హత మేరకు పలుమార్లు భారత్‌లోకి వచ్చి వెళ్లవచ్చు. వ్యాపార సమావేశాలు, వైద్య సంప్రదింపులు, వెల్‌నెస్ రిట్రీట్స్, స్వల్పకాలిక వైద్య చికిత్సలు, భారతీయ భాషలు, సంగీతం, కళలు, హస్తకళలకు సంబంధించిన కోర్సుల్లో పాల్గొనేవారికి ఈ వీసా ఉపయోగపడుతుంది.

ఇక ఎక్కువ కాలం భారత్‌లో ఉండాలనుకునే విదేశీయుల కోసం V-2 వీసాను తీసుకొచ్చారు. అర్హతలను బట్టి ఒక సంవత్సరం, ఐదు సంవత్సరాలు లేదా పదేళ్ల కాలపరిమితితో ఈ వీసా జారీ చేస్తారు. పర్వతారోహణ కార్యకలాపాలకు కూడా ఈ కేటగిరీలో ఆరు నెలల మల్టిపుల్ ఎంట్రీ వీసా పొందే అవకాశం ఉంటుంది. వేర్వేరు స్వల్పకాలిక ప్రయాణ అవసరాలను ఒకే విస్తృత కేటగిరీలోకి తీసుకురావడం వల్ల వీసా ఎంపికలో గందరగోళం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

వైద్య చికిత్స కోసం వచ్చే వారికి ప్రత్యేక వీసాలు
వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మెడికల్ వీసా విధానంలోనూ కేంద్రం మార్పులు చేసింది. ముఖ్యంగా సంప్రదాయ వైద్య చికిత్సలు, ఆయుష్ వైద్య విధానాలను వేర్వేరు కేటగిరీలుగా విభజించింది.

ఆయుష్ విధానాలకు చెందని సాధారణ వైద్య చికిత్సల కోసం M-1 వీసా జారీ చేస్తారు. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి తదితర ఆయుష్ వైద్య విధానాల్లో చికిత్స పొందాలనుకునేవారికి M-3 వీసా అందుబాటులో ఉంటుంది. ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన సాధారణ వీసాలతో పాటు ఈ-వీసా రూపంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని సాధారణంగా ఒక సంవత్సరం కాలపరిమితితో, మల్టిపుల్ ఎంట్రీ సదుపాయంతో జారీ చేయనున్నారు.

రోగులతో పాటు వచ్చే సహాయకులు, కుటుంబ సభ్యుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ వైద్య చికిత్స పొందేవారితో వచ్చే వారికి M-2 వీసా, ఆయుష్ చికిత్స పొందేవారితో వచ్చే వారికి M-4 వీసా అందిస్తారు. ప్రధానమంత్రి ప్రకటించిన 'హీల్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఈ మార్పులు మరింత ఊతమిస్తాయని కేంద్రం భావిస్తోంది.

విద్యార్థుల వీసాల్లోనూ మార్పులు
భారత్‌లో ఉన్నత విద్య, పరిశోధన చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు కూడా కొత్త విధానం ఉపయోగపడనుంది. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న విద్యార్థుల వీసా కేటగిరీలను రెండు ప్రధాన విభాగాలుగా కుదించారు.

S-1 వీసా కింద పాఠశాల విద్య, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదివే విదేశీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇక S-2 వీసా కేటగిరీలో డాక్టోరల్ ప్రోగ్రామ్‌లు, పరిశోధకులు, విజిటింగ్ ఫ్యాకల్టీ, ఇంటర్న్‌షిప్‌లు, విద్యా మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనేవారిని చేర్చారు.

ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ 'స్టడీ ఇన్ ఇండియా' పోర్టల్ ద్వారా భారత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులకు e-S1 వీసా అందించనున్నారు. ఈ వీసా గరిష్ఠంగా ఐదేళ్ల వరకు లేదా విద్యార్థి చదివే కోర్సు పూర్తయ్యే వరకు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంతవరకు చెల్లుబాటవుతుంది. దీంతో భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు వీసా ప్రక్రియ మరింత సులభం కానుంది.

విదేశీ పెట్టుబడిదారులు, నిపుణులకు బిజినెస్ వీసాలు
భారత్‌లో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే విదేశీయులు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణుల కోసం బిజినెస్ వీసా విధానాన్ని కూడా పునర్వ్యవస్థీకరించారు. ఇందులో B-1, B-2 అనే రెండు ప్రధాన కేటగిరీలను ఏర్పాటు చేశారు.

B-1 వీసా కింద పారిశ్రామిక, వాణిజ్య సంస్థల స్థాపన వంటి దీర్ఘకాలిక వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. B-2 వీసా కింద స్వల్పకాలిక ఒప్పంద పనులు, ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు, సమావేశాలు, క్రీడలు, ప్రదర్శన కళలు, సినిమా రంగానికి సంబంధించిన పనుల కోసం భారత్‌కు వచ్చే వారికి అవకాశం కల్పిస్తారు.

భారతీయ కంపెనీల్లో పనిచేసే విదేశీ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, ప్రత్యేక రంగాల్లో అనుభవం ఉన్న నిపుణుల కోసం కూడా ప్రత్యేక వెసులుబాటు కొనసాగించనున్నారు. వీరు B-2 కేటగిరీలో ప్రొడక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ వీసా పొందవచ్చు. ఈ వీసాను ఈ-వీసా ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా జారీ చేస్తారు. గతంలో ఇదే సదుపాయం e-B4 వీసా పేరుతో అందుబాటులో ఉండేది.

విదేశీ నిపుణుల సేవలను వినియోగించుకోవడం ద్వారా సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పారిశ్రామిక కార్యకలాపాలు, ఉద్యోగులకు శిక్షణ, విదేశీ నైపుణ్యాల వినియోగం మరింత సులభతరం అవుతాయని ప్రభుత్వం చెబుతోంది.

వీసా దరఖాస్తు పేపర్‌వర్క్ 70 శాతం తగ్గింపు
ఈ మొత్తం మార్పుల్లో విదేశీయులకు అత్యంత ఉపయుక్తమైన అంశం దరఖాస్తు ప్రక్రియలో పేపర్‌వర్క్ తగ్గించడం. ప్రస్తుతం వీసా దరఖాస్తు ఫారాల్లో అవసరమయ్యే వివరాలు, ఫీల్డ్స్ సంఖ్యను కొత్త విధానంలో 65 నుంచి 70 శాతం వరకు తగ్గించారు. మొత్తం 23 వీసా కేటగిరీలు, ఉప కేటగిరీలకు ఈ మార్పులు వర్తించనున్నాయి.

దరఖాస్తుదారుల నుంచి అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించి, అనవసరమైన వివరాలను తొలగించనున్నారు. దీనివల్ల దరఖాస్తు నింపడానికి పట్టే సమయం తగ్గడంతో పాటు వీసా ప్రాసెసింగ్‌లో అధికారులకు కూడా పని సులభం కానుంది. అయితే వీసా పరిశీలనకు అవసరమైన కీలక వివరాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తారు.

2026 చివరి నాటికి కొత్త విధానం అమలు
ప్రస్తుతం భారత్‌ ఈ-వీసా సదుపాయాన్ని 172 దేశాల పౌరులకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) విధానం ద్వారా అందిస్తోంది. కొత్త వీసా విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన ఐటీ వ్యవస్థల్లో మార్పులు చేపట్టినట్లు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సాంకేతిక నవీకరణలు తుది దశకు చేరుకున్నాయని తెలిపింది.

2026 చివరి నాటికి ఐటీ వ్యవస్థల నవీకరణ పూర్తిచేసి, కొత్తగా సరళీకరించిన విధానం ప్రకారం వీసాల జారీని ప్రారంభించనున్నారు. ఈ మార్పులతో భారత్‌కు వచ్చే విదేశీయులకు ప్రయాణం, వైద్యం, విద్య, వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరం కావడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను పర్యాటక, విద్యా, వైద్య, పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

Tags

Be the first to react

Latest