Chandrababu: రేపు బనగానపల్లెకు సీఎం చంద్రబాబు.. ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనగా జూలై 9న నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేయనున్నారు.

CM Chandra Babu Naidu
CM Chandra Babu Naidu

రైతులకు గుడ్ న్యూస్.. 29 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి.. 

బనగానపల్లెలో రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందించనున్న చంద్రబాబు..

రీ సర్వే ప్రక్రియ పూర్తైన గ్రామాల్లోని భూ యజమానులకు హక్కులను పటిష్టం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తోంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసే పాస్ పుస్తకాలతో కలిపి ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం 29 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లవుతుంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,887 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ పూర్తయింది. ఈ గ్రామాలకు సంబంధించి 29.04 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం ముద్రించి పంపిణీ చేసింది. అలాగే గత నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 428 గ్రామాల్లో 2.48 లక్షల పాస్ పుస్తకాల పరిశీలనను రెవెన్యూ శాఖ పూర్తి చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన 9,929 గ్రామాల్లో కూడా రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా 64.53 లక్షల రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంది. నంద్యాల జిల్లాలో పంపిణీ కోసం 8,412 ఖాతా పుస్తకాలు, బనగానపల్లె నియోజకవర్గానికి సంబంధించి 1,125 పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది.

రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి బనగానపల్లెకు బయల్దేరుతారు. ఉదయం 11.20 గంటలకు బనగానపల్లెకు చేరుకుని, స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం పలువురు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.

తర్వాత మధ్యాహ్నం 2.35 గంటలకు బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం చంద్రబాబు తిరిగి అమరావతికి బయల్దేరుతారు.

రైతుల భూ హక్కులను మరింత పటిష్టం చేయడం, భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వే కార్యక్రమంలో భాగంగా సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags

Be the first to react

Latest