Kollu Ravindra: పడవ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారుడిని పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర!
Kollu Ravindra: వేటకు వెళ్లి సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారుడు చిన్నాను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు. చిన్నా ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం: మంత్రి కొల్లు రవీంద్ర..
చిన్నాకు కొత్త పడవ.. మత్స్యకారుల బీమా త్వరలో పునరుద్ధరణ..
విశాఖపట్నం: వేటకు వెళ్లి సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారుడు చిన్నాను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు. చిన్నా ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బాధితుడు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
చిన్నా కుటుంబ సభ్యులతో కూడా మంత్రి మాట్లాడారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి తోడుగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ పడవ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు కావడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఇప్పటికే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని స్థాయిలో ఈ సహాయాన్ని ప్రభుత్వం అందించిందని చెప్పారు.
చికిత్స పొందుతున్న చిన్నాకు కూడా ఆర్థిక సాయం అందించడంతో పాటు, ప్రమాదంలో దెబ్బతిన్న పడవకు బదులుగా కొత్త పడవను అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. ప్రమాదంలో దాదాపు రూ.50 లక్షల విలువైన పడవను కోల్పోవడంతో అతని జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంపై కూడా మంత్రి విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో వేటకు వెళ్లి 64 మంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయినా ఒక్క కుటుంబానికీ ఆర్థిక సహాయం అందలేదని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.3 కోట్ల మేర బాధిత కుటుంబాలకు సాయం చేసినట్లు తెలిపారు.
గతంలో పడవలకు బీమా సౌకర్యం ఉండేదని, ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం లభించేదని గుర్తు చేసిన మంత్రి, ఆ బీమా పథకాన్ని త్వరలోనే మళ్లీ అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. అలాగే సముద్రంలో పడవల భద్రతను పెంచేందుకు ప్రతి పడవలో ట్రాకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యలు చేపడతామని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారుల సంక్షేమం, వారి ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మత్స్యకారులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
పడవ ప్రమాదం వంటి విషాద ఘటనలపై రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి సందర్భాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, కుట్రపూరిత ప్రచారాలను ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు.
Tags
Be the first to react