Chandrababu: రైతు కుటుంబాల ఆదాయం పెంచే పారిశ్రామికీకరణపై సీఎం చంద్రబాబు దృష్టి!
Chandrababu: రైతు కుటుంబాలు కేవలం వ్యవసాయానికే పరిమితం కాకుండా పారిశ్రామిక రంగంలో కూడా భాగస్వాములై ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేలా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
19వ ఎస్ఐపీబీ సమావేశంలో 11 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.. 10,531 ఉద్యోగాలకు అవకాశం..
ఇథనాల్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం.. రైతుల ఆదాయం పెంచాలని సీఎం చంద్రబాబు సూచన..
అమరావతి: రైతు కుటుంబాలు కేవలం వ్యవసాయానికే పరిమితం కాకుండా పారిశ్రామిక రంగంలో కూడా భాగస్వాములై ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేలా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని ఆదేశించారు.
సచివాలయంలో మంగళవారం జరిగిన 19వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశానికి సీఎం అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మొత్తం 11 కొత్త ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.9,076.11 కోట్ల పెట్టుబడులు రానుండగా, 10,531 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
దేశంలో ఇథనాల్ వినియోగం భవిష్యత్లో మరింత పెరుగుతుందని, పెట్రోలు, డీజిల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 40 శాతానికి పెంచే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రం ముందుగానే సిద్ధం కావాలని సీఎం సూచించారు. ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే మొక్కజొన్న రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఇథనాల్, మీథేన్, ఏవియేషన్ ఫ్యూయల్ రంగాలకు ప్రత్యేక విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
సంపద సృష్టి, సర్క్యులర్ ఎకానమీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సీఎం, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి రైతులకు ఎక్కువ లాభాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రాష్ట్రంలో పర్యాటక రంగానికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న సీఎం, తిమ్మమ్మ మర్రిమాను సహా రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పోలవరం, దిండి, గండికోట, కంబం చెరువు, లంబసింగి వంటి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. లంబసింగి, అరకు సమీపంలో రిసార్ట్ ఏర్పాటు చేసేందుకు జిందాల్ సంస్థ ఆసక్తి చూపుతోందని తెలిపారు.
ఏటికొప్పాక, కొండపల్లి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ, పొందూరు వంటి సంప్రదాయ కళలకు పర్యాటక అనుసంధానం కల్పించాలని సూచించారు. నేచర్ పార్కులు, వాటర్ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులను ఒకే పర్యాటక గొలుసుగా అభివృద్ధి చేయాలని చెప్పారు. సూర్యలంక మాస్టర్ ప్లాన్ను త్వరగా సిద్ధం చేయాలని, కుప్పంలో కంగుంది కోట, చిత్తూరు జిల్లాలో ఎలిఫెంట్ సఫారీ వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో పర్యాటక రంగానికి అనుగుణంగా హోటల్ వసతులు కూడా వేగంగా పెరుగుతున్నాయని సీఎం తెలిపారు. 2024లో రాష్ట్రంలో 4,390 హోటల్ గదులు మాత్రమే ఉండగా, గత రెండేళ్లలో మరో 9,364 హోటల్ గదుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని చెప్పారు. దీంతో మొత్తం 13,753 హోటల్ గదులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఈ ప్రక్రియలో పనిచేసిన అధికారులను అభినందించారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమలను ఆకర్షించాలని, ఈ రంగంలో ఏపీ దేశంలో అగ్రగామిగా నిలవాలని అన్నారు.
అలాగే రాష్ట్రంలో ఇంకా ఏర్పాటు చేయాల్సిన 38 ఎంఎస్ఎంఈ పార్కులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. వాటిని రైల్వే టెర్మినల్స్తో అనుసంధానం చేయాలని, లాజిస్టిక్స్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని చెప్పారు. కొత్త పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, బీపీసీఎల్, ఆమ్కా ప్రాజెక్టులు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 19 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించగా, మొత్తం 339 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.11.86 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానుండగా, 10.41 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
19వ ఎస్ఐపీబీ సమావేశంలో పర్యాటకం, హోటల్స్, లాజిస్టిక్స్, సోలార్ ఎనర్జీ, గనులు, ఫుడ్ ప్రాసెసింగ్, పారిశ్రామిక పార్కులు వంటి వివిధ రంగాలకు చెందిన 11 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
నెల్లూరులో నాలుగు స్టార్ హోటల్, కడపలో మూడు స్టార్ హోటల్, అమ్యూజ్మెంట్ పార్క్, విజయవాడలో హోటల్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్, తిరుపతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్, అనకాపల్లిలో సోలార్ సెల్ తయారీ యూనిట్, బొబ్బిలిలో మాంగనీస్ ఆధారిత పరిశ్రమ, కర్నూలులో స్వర్ణగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్, విశాఖలో గూగుల్ వేర్హౌస్ భాగస్వామ్యంతో లాజిస్టిక్స్ పార్క్, అదానీ ఫౌండేషన్ ప్రాజెక్టు, శ్రీ సిటీలో మోండెలీజ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు అనుమతులు లభించాయి.
ఈ సమావేశంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి. నారాయణ, గొట్టిపాటి రవికుమార్, దుర్గేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags
Be the first to react