⚡ BREAKING

El Nino: ఎల్-నినో ప్రభావంపై ఏపీ హై అలర్ట్.. ‘జీరో లాస్’ లక్ష్యంతో అన్ని శాఖలు అప్రమత్తం!

El Nino: ఎల్-నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో వర్షాభావం, ప్రకృతి విపత్తులు ఎదురయ్యే అవకాశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. ప్రజల ప్రాణాలు, జీవనోపాధి రక్షణే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

Home Minister Anitha
Home Minister Anitha

వర్షాభావం, విపత్తుల ముప్పు.. రాష్ట్ర యంత్రాంగానికి హై అలర్ట్..

ప్రజల ప్రాణాలు, జీవనోపాధి రక్షణే ప్రథమ ప్రాధాన్యం: మంత్రి వంగలపూడి అనిత..

అమరావతి: ఎల్-నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో వర్షాభావం, ప్రకృతి విపత్తులు ఎదురయ్యే అవకాశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. ప్రజల ప్రాణాలు, జీవనోపాధి రక్షణే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వాతావరణ హెచ్చరికల ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకుని ‘జీరో లాస్’ లక్ష్యంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

మంగళవారం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానోతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాల పరిస్థితులు, వర్షపాతం లోటు, కరవు ముప్పు, విపత్తు నిర్వహణ చర్యలపై సమగ్రంగా చర్చించారు.

విపత్తులు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్లు సిద్ధంగా ఉండాలని, భారత వాతావరణ శాఖ (IMD), RTGS, APSDMA అందించే హెచ్చరికల ఆధారంగా వెంటనే స్పందించాలని ఆదేశించారు.

CAP, SMS, వాట్సాప్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వంటి అన్ని వేదికల ద్వారా ప్రజలకు వాతావరణం, వరదలు, పిడుగులపై హెచ్చరికలు వేగంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా సన్నద్ధత చర్యలను పర్యవేక్షించాలని మంత్రి స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాల కోసం రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానాలను (SOPs) అన్ని శాఖలు తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రతిరోజూ చేపట్టిన చర్యలపై నివేదికలను APSDMAకు సమర్పించాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, ఫైర్ సర్వీసులు, జలవనరులు, ఆరోగ్యం, విద్యుత్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోని 688 మండలాల్లో 105 మండలాలు తీవ్రంగా, మరో 208 మండలాలు మధ్యస్థ స్థాయిలో కరవు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, వైఎస్సార్ కడప, తిరుపతి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో మధ్యస్థ ప్రభావం ఉండొచ్చని తెలిపారు.

వ్యవసాయ శాఖ రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని, అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. డైరెక్ట్ సీడెడ్ రైస్ (DSR), సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ (SRI), APCNF పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. ఉద్యానవన శాఖ డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ వంటి నీటి పొదుపు పద్ధతులను విస్తృతంగా అమలు చేయాలని చెప్పారు.

పశుసంవర్ధక శాఖ పశుగ్రాసం, దాణా, తాగునీటి ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, అత్యవసర పశువైద్య బృందాలు సిద్ధంగా ఉంచాలని మంత్రి సూచించారు.

మత్స్యశాఖ సముద్ర వాతావరణ హెచ్చరికలను ప్రతి మత్స్యకార గ్రామానికి వెంటనే చేరవేయాలని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో చేపల వేటను నిలిపివేయాలని ఆదేశించారు. ప్రతి పడవలో భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.

గ్రామీణ తాగునీటి శాఖ సమస్యాత్మక గ్రామాల్లో నీటి సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూడాలని, పనిచేయని పథకాలను 48 గంటల్లో పునరుద్ధరించాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు.

గ్రామాల్లో డ్రైన్లు, కాలువలు, చెరువుల పూడికతీత పనులు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖకు సూచించారు. పట్టణాల్లో వర్షపు నీటి కాలువలను శుభ్రం చేసి, డీ-వాటరింగ్ పంపులు, అత్యవసర యంత్రాలను సిద్ధంగా ఉంచాలని మున్సిపల్ శాఖను ఆదేశించారు. దోమల నివారణ చర్యలు, సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.

రిజర్వాయర్లు, నదుల నీటిమట్టాలను 24 గంటలూ పర్యవేక్షించాలని, బలహీనమైన కరకట్టలను బలోపేతం చేయాలని జలవనరుల శాఖకు సూచించారు. దిగువ ప్రాంతాలకు ముందస్తు వరద హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.

దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతు చేయాలని, జేసీబీలు, క్రేన్లు సిద్ధంగా ఉంచాలని రోడ్లు & భవనాల శాఖకు చెప్పారు. విద్యుత్ శాఖ ఆసుపత్రులు, తాగునీటి పథకాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.

మందులు, ORS, IV ఫ్లూయిడ్స్, అత్యవసర వైద్య సామగ్రి నిల్వ ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. అంబులెన్సులు, ర్యాపిడ్ మెడికల్ బృందాలు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

పోలీసు, అగ్నిమాపక, APSDRF, NDRF బృందాలు 24 గంటలూ సిద్ధంగా ఉండాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో పడవలు, రక్షణ పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ముందుగానే మోహరించాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం కోసం మాక్ డ్రిల్లులు నిర్వహించాలని సూచించారు.

సమావేశంలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF/NDRF) కింద 2025–26లో రూ.277.63 కోట్లు, 2026–27లో రూ.479.01 కోట్లు విడుదల చేశారు.

2024 జూన్ నుంచి 2026 జూన్ వరకు పిడుగుపాటుతో మరణించిన 141 మంది కుటుంబాలకు రూ.5.61 కోట్ల ఎక్స్గ్రేషియా, పశువుల నష్టానికి రూ.30.81 లక్షల ఆర్థిక సాయం అందించారు.

దీర్ఘకాలిక విపత్తు ఉపశమన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి కింద రూ.521.17 కోట్లు కేటాయించగా, ఇటీవల మరో రూ.83.70 కోట్లకు ఆమోదం లభించింది. కేంద్రానికి రూ.531.33 కోట్ల విలువైన ప్రాజెక్టు ప్రతిపాదనలు కూడా పంపినట్లు అధికారులు తెలిపారు.

కమ్యూనిటీ ఆధారిత విపత్తు నిర్వహణను బలోపేతం చేయడానికి ఈ ఏడాది 1,214 మంది యువ ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. వీరిలో 1,114 మంది NCC, 100 మంది NSS వాలంటీర్లు ఉన్నారు. మరో 52 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తయింది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల్లో మరో 300 మంది NCC వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

రాష్ట్రంలో జూన్ నెలలో 25 శాతం, జూలైలో ఇప్పటివరకు 41 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నవంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలంలో మొత్తం 27 శాతం వర్షపాతం లోటు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,161 రైతు సేవా కేంద్రాలను అధిక ముప్పు ప్రాంతాలుగా గుర్తించామని, పోలవరం, శ్రీశైలం నీటి లభ్యతపై ప్రత్యేక అంచనాలు రూపొందిస్తూ కాలువల నిర్వహణకు ఆధునిక నిర్ణయ సహాయక వ్యవస్థ (DSS)ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు వివరించారు.

సమావేశం ముగింపులో మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, నైరుతి రుతుపవనాల కాలం ముగిసే వరకు ప్రతి శాఖ హై అలర్ట్లో ఉండాలని పునరుద్ఘాటించారు. ప్రజల ప్రాణాలు, జీవనోపాధి రక్షణతో పాటు అత్యవసర సేవలను వేగంగా పునరుద్ధరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Tags

Be the first to react

Latest