⚡ BREAKING

Pawan Kalyan: హస్తకళలకు కొత్త ఊపు.. టెంపుల్ టూరిజం తరహాలో ‘హస్తకళల పర్యాటకం’కు శ్రీకారం!

Pawan Kalyan: రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళలకు దేశ, విదేశాల్లో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే హస్తకళల పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

Craft Tourism
Craft Tourism

హస్తకళలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తాం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్.. కళాకారుడికి ప్రత్యేక గుర్తింపు..

విజయవాడ: రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళలకు దేశ, విదేశాల్లో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే హస్తకళల పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కళాఖండాన్ని రూపొందించిన ప్రతి కళాకారుడికి గుర్తింపు దక్కేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి కళాకారుడి పేరు, అతని కథ, కళ విశేషాలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళా వేదికలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం–2026’ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన హస్తకళాకారులు తమ ప్రత్యేక కళాఖండాలను ప్రదర్శించగా, ప్రతి స్టాల్ను సందర్శించిన ఆయన కళాకారులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. పలు హస్తకళా ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేసి కళాకారులకు ప్రోత్సాహం అందించారు.

మంత్రి మాట్లాడుతూ హస్తకళల పరిరక్షణ కూటమి ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించాలని అధికారులకు సూచించారు. వీబీ జీ రాం జీ పథకం కింద క్లస్టర్ల వారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కళాకారుడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్లస్టర్ల వారీగా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.

కాకినాడకు చెందిన తోలుబొమ్మల కళాకారుల స్టాల్ను సందర్శించిన పవన్ కళ్యాణ్, రామాయణంలోని రావణ సంహార ఘట్టం ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. తరతరాలుగా ఈ కళను కొనసాగిస్తున్న కుటుంబాలను అభినందిస్తూ, రాబోయే గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాటకు ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఉప్పాడ జాందానీ చీరల స్టాల్లో పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా కొణిదల కోసం మూడు ఉప్పాడ పట్టు చీరలను కొనుగోలు చేశారు. తన కోసం కూడా కొన్ని వస్త్రాలను తీసుకున్నారు. అరటిపీచుతో తయారైన పర్యావరణహిత హ్యాండ్బ్యాగులు, ఫైళ్లు తదితర ఉత్పత్తులను పరిశీలించి, వాటి తయారీ విధానాన్ని కళాకారుల వద్ద తెలుసుకుని ఒక హ్యాండ్బ్యాగ్ను కొనుగోలు చేశారు.

తిరుపతి చెక్క బొమ్మలు, శ్రీకాళహస్తి కలంకారీ, పెడన కలంకారీ, నరసాపురం లేస్, గిరిజన సవర కళలు తదితర స్టాళ్లను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి కళాకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కలంకారీ కళాకారుల కష్టాన్ని ప్రజలకు తెలియజేసేలా వీడియో డాక్యుమెంటరీలు రూపొందించాలని సూచించారు. పెడన కలంకారీ కళాకారులు కోరిన ఇండిగో రంగులు, కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుపై సానుకూలంగా స్పందించారు. నరసాపురం లేస్ కళాకారులు ఆరోగ్య సమస్యలను ప్రస్తావించగా, వారి కోసం ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

కళాకారుడికి తగిన గుర్తింపు రావాలని, అందుకోసం ప్రతి కళాఖండంపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కళాకారుడి వివరాలు, ఆ కళ చరిత్ర, తయారీ ప్రక్రియను తెలుసుకునే అవకాశం కల్పించాలని చెప్పారు. జపాన్ తరహాలో కళాకారులను గౌరవించే సంస్కృతి రాష్ట్రంలో కూడా రావాలని ఆకాంక్షించారు.

సవర గిరిజన కళాకారుల కోసం ఏజెన్సీ ప్రాంతంలో వీబీ జీ రాం జీ పథకం కింద ప్రత్యేక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్యాటరీ అవసరం లేకుండా పనిచేసే సైంటిఫిక్ చెక్క బొమ్మలు, చెక్కతో చేసిన టెలిస్కోప్ వంటి వినూత్న ఉత్పత్తులను పరిశీలించి, ఇలాంటి విద్యాపరమైన బొమ్మలను గ్రామీణ పాఠశాలల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఏలూరు కార్పెట్ కళాకారులు, అనంతపురం అరటిపీచు కళాకారుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒక్కో విభాగం నుంచి 30 మంది కళాకారులకు రెండు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు.

గుంటూరు, కాకినాడలో పునరుద్ధరించిన లేపాక్షి షోరూంలతో పాటు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటు చేసిన లేపాక్షి షోరూమ్ను వర్చువల్గా ప్రారంభించారు.

అలాగే లేపాక్షి ఈ-కామర్స్ యాప్ను ఆవిష్కరించారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉండే ఈ యాప్ ద్వారా రాష్ట్ర హస్తకళా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అవకాశాలు లభించనున్నాయి.

రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్లస్టర్లలో ఏర్పాటు చేసిన 100 ఉద్యమ్ వర్క్షాప్లను కూడా ప్రారంభించారు. వీటి ద్వారా సుమారు 2,000 మంది కళాకారులను అధికారిక పారిశ్రామిక వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ఈ సందర్భంగా సంప్రదాయ హస్తకళల పరిరక్షణ, ప్రచారంలో విశేష సేవలు అందించిన పలువురు కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest