ప్రతిపక్షానికి అల్లర్లు కావాలి.. ప్రజలకు అభివృద్ధి కావాలి.. సచివాలయంలో దేవాదాయ మంత్రి ఘాటు వ్యాఖ్యలు!
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తుంటే, ప్రతిపక్షం మాత్రం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
రాజ్యాంగం ఇచ్చింది భావప్రకటనా స్వేచ్ఛ.. విద్వేషాలు రెచ్చగొట్టే లైసెన్స్ కాదు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్!
ఆర్టికల్ 19(2), 25లను గుర్తుచేసిన ఆనం.. మత విశ్వాసాలను కించపరిస్తే చట్టం ఊరుకోదని హెచ్చరిక!
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తుంటే, ప్రతిపక్షం మాత్రం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
నేడు రాష్ట్ర సచివాలయంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి లభిస్తున్న విశేష ఆదరణను జీర్ణించుకోలేక కొందరు ఉద్దేశపూర్వక దుష్ప్రచారాలు, సమాజాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు.
సమాజంలో శాంతి, సామరస్యం, పరస్పర గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రజా వేదికలను ఉపయోగించి మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు, భారత రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని మంత్రి స్పష్టం చేశారు. మత విశ్వాసాలను అవమానించే వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను రాజకీయంగా సమర్థించడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ప్రతిపక్ష నాయకత్వం రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హిందూ మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు, సనాతన ధర్మ విశ్వాసాలను కించపరిచే వ్యాఖ్యలు ఏ రూపంలో వచ్చినా అవి తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరునికి భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించినప్పటికీ, ఆర్టికల్ 19(2) ప్రజా శాంతి, సామాజిక సామరస్యం, ఇతరుల హక్కులు, మత విశ్వాసాల పరిరక్షణ దృష్ట్యా సహేతుకమైన పరిమితులను కూడా నిర్దేశించిందని గుర్తు చేశారు.
అదేవిధంగా ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన మతాన్ని విశ్వసించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కును కల్పించినా, ఆ స్వేచ్ఛ ఇతర మతాలను అవమానించడానికి, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి లేదా సామాజిక విభేదాలను రెచ్చగొట్టడానికి అనుమతి కాదని రాజ్యాంగ స్ఫూర్తి స్పష్టంగా చెబుతోందన్నారు.
ప్రతి వ్యక్తికి తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉన్నట్లే, ఇతరుల మత విశ్వాసాలను గౌరవించడం కూడా రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. దళితులు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సహా అన్ని వర్గాల మధ్య సామరస్యం నెలకొల్పడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యతేనని, విభజన సృష్టించడం కాదు అని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ఉద్దేశ్యం సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అభ్యున్నతి సాధించడమే తప్ప, వాటి పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టడం రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అల్లర్లు అవసరం లేదని, అభివృద్ధి కావాలని, విద్వేషం కాదని, పెట్టుబడులు కావాలని, కులాల మధ్య చిచ్చు కాదని, యువతకు ఉపాధి అవకాశాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఇతరుల మత విశ్వాసాలను అవమానించే హక్కు కాదని, రాజ్యాంగం స్వేచ్ఛను ఇచ్చిందిగానీ విద్వేషాన్ని వ్యాప్తి చేసే లైసెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు ఏ ప్రజాస్వామ్య సమాజంలోనూ సమర్థించదగినవి కావని పేర్కొన్నారు. అలాంటి అంశాలపై కేసుల నమోదు, దర్యాప్తు, న్యాయపరమైన చర్యలు పూర్తిగా చట్టబద్ధ ప్రక్రియల ప్రకారమే జరుగుతాయని, ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోదని, పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తారని, న్యాయస్థానాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాయని మంత్రి స్పష్టం చేశారు.
సనాతన ధర్మం ప్రపంచానికి "వసుధైక కుటుంబం", "సర్వే జనాః సుఖినో భవంతు", "లోకాః సమస్తాః సుఖినో భవంతు" వంటి విశ్వమానవ సందేశాలను అందించిందని, ప్రేమ, సహనం, సహజీవనం, పరస్పర గౌరవమే దాని మూలసూత్రాలని మంత్రి పేర్కొన్నారు. మతం అనేది మనసుకు మార్గదర్శకంగా ఉండాలే తప్ప, సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేసే సాధనంగా మారకూడదని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారులు సీతారామాంజనేయ ప్రసాద్ , కమినషర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు.
Be the first to react