Nara Lokesh: దక్షిణ కొరియాలో ఎల్జీ కెమ్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో భారీ పెట్టుబడులకు ఆహ్వానం!
Nara Lokesh: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. మూడో రోజు పర్యటనలో భాగంగా ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్, ఎల్జీ ఓవర్సీస్ హోల్డింగ్ కంపెనీస్ హెడ్ యున్-జు కోహ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు.
దక్షిణ కొరియాలో ఎల్జీ కెమ్తో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్టుబడుల ఆహ్వానం..
ఈవీ బ్యాటరీలు, బయోఫ్యూయల్ రంగాల్లో పెట్టుబడులకు ఎల్జీ కెమ్ను ఆహ్వానించిన లోకేష్..
సియోల్: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. మూడో రోజు పర్యటనలో భాగంగా ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్, ఎల్జీ ఓవర్సీస్ హోల్డింగ్ కంపెనీస్ హెడ్ యున్-జు కోహ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టైరిన్ తయారీ కేంద్రం లేదా పరిశ్రమల సముదాయాన్ని ఏర్పాటు చేయాలని ఎల్జీ కెమ్ను ఆహ్వానించారు. అలాగే దక్షిణ కొరియాలో ఎల్జీ కెమ్ నిర్వహిస్తున్న అధునాతన పారిశ్రామిక నమూనాను ఆదర్శంగా తీసుకుని, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు.
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ నిల్వ వ్యవస్థలకు డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, సమీకృత క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీ యూనిట్తో పాటు బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని ఈవీ తయారీ రంగంలో కీలక కేంద్రంగా మార్చగలవని తెలిపారు.
పర్యావరణ హిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, మూలపేటలో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF), బయో-ఇథనాల్ ఉత్పత్తి చేసే జీవ ఇంధనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని కోరారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చేందుకు ప్లాస్టిక్ రీసైక్లింగ్, పైరోలిసిస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని మంత్రి లోకేష్ ఎల్జీ కెమ్కు విజ్ఞప్తి చేశారు. ఈ రంగాల్లో ప్రభుత్వం అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
సమావేశంలో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్-జు కోహ్ మాట్లాడుతూ, గతంలో విశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ ద్వారా ఎల్జీ ఎలక్ట్రానిక్స్తో పాటు భారతదేశంలోని ఇతర తయారీ సంస్థలకు పాలీస్టైరిన్ ఉత్పత్తులను సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం శ్రీసిటీలో ఏబీఎస్ (Acrylonitrile Butadiene Styrene) కాంపౌండ్ ప్లాంట్ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేసిన పెట్టుబడి ప్రతిపాదనలను తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో సమగ్రంగా చర్చించి, వాటిపై తగిన నిర్ణయం తీసుకుంటామని యున్-జు కోహ్ వెల్లడించారు.
మంత్రి లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ, రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, ఆధునిక తయారీ యూనిట్లు, ఉపాధి అవకాశాలు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
Tags
Be the first to react