Amaravathi: క్వాంటం టెక్నాలజీలో ఏపీకి కొత్త గుర్తింపు.. డిసెంబర్ నుంచి అమరావతిలో తొలి క్వాంటం కంప్యూటర్!
Amaravathi: ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక రంగంలో దేశానికి ఆదర్శంగా నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
డిసెంబర్ నుంచి అమరావతిలో దేశపు తొలి 133-క్యూబిట్ క్వాంటం కంప్యూటర్..
రెండేళ్లలో అమరావతి నుంచే క్వాంటం కంప్యూటర్ల ఎగుమతులే లక్ష్యం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక రంగంలో దేశానికి ఆదర్శంగా నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచి క్వాంటం కంప్యూటర్ల తయారీతో పాటు విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్లో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది ఫిబ్రవరి 7న ప్రారంభించిన అమరావతి క్వాంటం వ్యాలీ (AQV) రాష్ట్రాన్ని అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చే దిశగా కీలక అడుగుగా నిలిచిందన్నారు. IBM, TCS, L&T వంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి క్వాంటం ఎకోసిస్టమ్ను అమరావతిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారతదేశపు తొలి 133-క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ అమరావతిలో అందుబాటులోకి రానుందని మంత్రి వెల్లడించారు. అలాగే అమెరికా వెలుపల IBM ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే రెండో అత్యాధునిక 156-క్యూబిట్ 'హెరాన్ ప్రాసెసర్' కూడా అమరావతిలో ఏర్పాటు కానుందని చెప్పారు. దీంతో భారత్ 2030 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న క్వాంటం రంగ అభివృద్ధిని మరింత ముందుగానే సాధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
అమరావతిలో నిర్మించనున్న క్వాంటం ట్విన్ టవర్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్, పరిశోధనలు, స్టార్టప్లు, సాంకేతిక సంస్థలకు అత్యాధునిక మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. రాష్ట్రంలో క్వాంటం రంగానికి అవసరమైన పరిశోధన, తయారీ, ఆవిష్కరణలకు ఇది ప్రధాన కేంద్రంగా మారుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025–2030 కింద క్వాంటం స్టార్టప్లు, విద్యాసంస్థలు, హార్డ్వేర్ తయారీ సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు, ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించనున్నట్లు తెలిపారు. దీంతో దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నేషనల్ క్వాంటం మిషన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన అభివృద్ధి లక్ష్యాలు రాష్ట్రానికి కొత్త అవకాశాలు తీసుకువస్తాయని మంత్రి అన్నారు. క్వాంటం టెక్నాలజీ ద్వారా తయారీ రంగం బలోపేతం కావడంతో పాటు యువతకు అధునాతన ఉద్యోగ అవకాశాలు, స్థానిక కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.
ఇప్పటికే ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ బలమైన స్థానం సంపాదించిందని, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ రంగంలోనూ దేశంలో అగ్రస్థానానికి చేరుకునే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. యువ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని, ప్రపంచ స్థాయి వ్యాపారాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ డాక్టర్ జేబీవీ రెడ్డి, క్యూబిట్ ఫోర్స్ సంస్థ ప్రతినిధి వెంకట్, నేషనల్ ఫిజికల్ లాబొరేటరీకి చెందిన వేణుగోపాల్తో పాటు పలువురు శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
Tags
Be the first to react