అరకు, పాడేరు నుంచి రాజమండ్రికి కొత్త గ్రీన్ హైవే.. పూర్తి రూట్ వివరాలు ఇవే!
Araku to Rajahmundry: ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగానికి, రవాణా సౌకర్యాలకు కొత్త ఊపునిచ్చేలా అరకు–పాడేరు–రాజమండ్రి మధ్య జాతీయ రహదారి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. గిరిజన ప్రాంతాల ప్రకృతి అందాలను గోదావరి తీరంతో అనుసంధానించే జాతీయ రహదారి 516ఈ (NH-516E) గ్రీన్ హైవే అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. గతంలో అరకు నుంచి రాజమండ్రి వెళ్లాలంటే విశాఖపట్నం నగరం మీదుగా సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త మార్గం ద్వారా ఈ దూరం సుమారు 246 నుంచి 280 కిలోమీటర్లకు తగ్గనుంది. దీంతో గిరిజన ప్రాంతాల ప్రజలతో పాటు పర్యాటకులు, వ్యాపారులకు కూడా ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.
అరకు టు రాజమండ్రి ప్రయాణం మరింత సులభం.. 300 కి.మీ. దూరం 246 కి.మీ.కు తగ్గింపు..
విశాఖ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేదు.. అరకు నుంచి రాజమండ్రికి కొత్త రూట్ సిద్ధం..
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగానికి, రవాణా సౌకర్యాలకు కొత్త ఊపునిచ్చేలా అరకు–పాడేరు–రాజమండ్రి మధ్య జాతీయ రహదారి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. గిరిజన ప్రాంతాల ప్రకృతి అందాలను గోదావరి తీరంతో అనుసంధానించే జాతీయ రహదారి 516ఈ (NH-516E) గ్రీన్ హైవే అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. గతంలో అరకు నుంచి రాజమండ్రి వెళ్లాలంటే విశాఖపట్నం నగరం మీదుగా సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త మార్గం ద్వారా ఈ దూరం సుమారు 246 నుంచి 280 కిలోమీటర్లకు తగ్గనుంది. దీంతో గిరిజన ప్రాంతాల ప్రజలతో పాటు పర్యాటకులు, వ్యాపారులకు కూడా ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.
ఈ కొత్త హైవే అరకు నుంచి పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, లంబసింగి, రంపచోడవరం మీదుగా రాజమండ్రిని చేరుకుంటుంది. తూర్పు కనుమల కొండల మధ్య నిర్మితమవుతున్న ఈ రహదారి ప్రయాణ దూరాన్ని తగ్గించడమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన అనుభూతిని అందించనుంది. అరకు కాఫీ తోటలు, వనజంగి మేఘాల కొండలు, లంబసింగి చల్లని వాతావరణం, తూర్పు కనుమల అందమైన ఘాట్ రోడ్ల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. దీంతో రవాణా మార్గంగానే కాకుండా పర్యాటక ఆకర్షణగా కూడా ఈ హైవే ప్రాధాన్యం సంతరించుకోనుంది.
ప్రస్తుతం ఈ రహదారిపై రెండు వరుసల రహదారి (టూ లేన్) విస్తరణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అరకు నుంచి రాజమండ్రికి సొంత వాహనాల్లో వెళ్లే ప్రయాణికులకు సుమారు 4 నుంచి 5 గంటల ప్రయాణ సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో విశాఖపట్నం మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడు నేరుగా ఏజెన్సీ ప్రాంతాల మీదుగా ప్రయాణించే అవకాశం ఏర్పడుతోంది. ముఖ్యంగా పాడేరు, చింతపల్లి, రంపచోడవరం వంటి ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ప్రజా రవాణాను కూడా మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఇప్పటికే ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని అందిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు రాజమండ్రి నుంచి అరకు వైపు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతోంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటలకు అరకు నుంచి పాడేరు మీదుగా రాజమండ్రికి బస్సు సర్వీసు నడుస్తోంది. దీంతో సొంత వాహనాలు లేని ప్రయాణికులు కూడా ఈ ప్రాంతాల మధ్య నేరుగా రాకపోకలు సాగించే అవకాశం కలుగుతోంది.
అయితే ఈ మార్గంలో ప్రయాణించేవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తూర్పు కనుమల ఘాట్ రోడ్లలో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో రహదారి మలుపులు, కొండ మార్గాలు ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వేగ పరిమితిని పాటిస్తూ, అవసరమైనప్పుడు ఫాగ్ లైట్లు వినియోగిస్తూ ప్రయాణించాలని సూచిస్తున్నారు.
మొత్తంగా NH-516E గ్రీన్ హైవే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలకు మెరుగైన రవాణా అనుసంధానం ఏర్పడనుంది. అరకు, పాడేరు వంటి పర్యాటక ప్రాంతాలకు రాజమండ్రి, గోదావరి జిల్లాల నుంచి వచ్చే సందర్శకులకు ప్రయాణం సులభం కానుంది. అదే సమయంలో స్థానిక ప్రజలకు విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వంటి అవసరాలకు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తక్కువ దూరంలో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం కల్పించే ఈ గ్రీన్ హైవే ఉత్తరాంధ్ర, గోదావరి ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయనుంది.
Tags
Be the first to react