శబరిమల అయ్యప్ప భక్తులకు ఖుషి కబురు! నేరుగా పంబాకే బస్సు!

Sabarimala Yatra: శబరిమల మండల-మకరవిళక్కు యాత్ర సీజన్ దృష్ట్యా అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. కేఎస్ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సు చార్టరింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. భక్తుల బృందం మొత్తం 45 సీట్లను ఒకేసారి బుక్ చేసుకుంటే, బస్సు నేరుగా వారి నిర్దేశిత ప్రాంతానికి వచ్చి ఎక్కించుకుని నీలక్కల్ వద్ద మారే పని లేకుండా నేరుగా పంబా వరకు చేరుస్తుంది. వీటికి సాధారణ టికెట్ ధరలే వర్తిస్తాయి.

పంబాకే కేఎస్ఆర్టీసీ బస్సు
పంబాకే కేఎస్ఆర్టీసీ బస్సు
  • విమాన చార్టరింగ్ తరహాలోనే బస్సు సర్వీస్.. భక్తులు కోరిన ఊరికే నేరుగా చేరుకోనున్న ఆర్టీసీ బస్సు!

  • మొత్తం 45 సీట్లు ఒకేసారి బుక్ చేసుకోవడం తప్పనిసరి.. పాక్షిక బుకింగ్‌లకు అనుమతి లేదు!

  • సాధారణ టికెట్ ఛార్జీలే వర్తింపు.. చార్టరింగ్ పేరుతో ఎలాంటి అదనపు రుసుములు ఉండవన్న మంత్రి!

Travel: రాబోయే మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌ను పురస్కరించుకుని శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏటా శబరిమల యాత్రా సమయంలో లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో రవాణా వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంటుంది. ముఖ్యంగా నీలక్కల్ నుంచి పంబా మార్గంలో ఎదురయ్యే రద్దీ, ట్రాఫిక్ ఇక్కట్లను శాశ్వతంగా తగ్గించేందుకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) ద్వారా ప్రత్యేక బస్సు చార్టరింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సి. పి. జాన్ ప్రకటించారు.

నీలక్కల్ వద్ద బస్సులు మారే ప్రయాసకు చెక్

సాధారణంగా శబరిమలకు వెళ్లే ప్రైవేట్ వాహనాలు, ఇతర రాష్ట్రాల బస్సులను కేవలం నీలక్కల్ బేస్ క్యాంప్ వరకే అనుమతిస్తారు. అక్కడ నుంచి పంబా వరకు చేరుకోవడానికి భక్తులు తమ ఇరుముడులు, సామాగ్రితో క్యూలైన్లలో నిలబడి కేఎస్ఆర్టీసీ చైన్ సర్వీసులను ఆశ్రయించాల్సి వస్తుంది. పీక్ సీజన్‌లో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం వల్ల నీలక్కల్ వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే, ఈ కొత్త చార్టరింగ్ సౌకర్యం ద్వారా భక్తులు మధ్యలో ఎక్కడా వాహనాలు మారాల్సిన అవసరం లేకుండా తాము ఎక్కిన బస్సులోనే నేరుగా పంబా బేస్ క్యాంప్‌కు చేరుకోవచ్చు.

ఫ్లైట్ తరహాలోనే బస్సు చార్టరింగ్ సదుపాయం

ఈ విధానం విమాన చార్టరింగ్ తరహాలోనే పనిచేస్తుందని మంత్రి వివరించారు. ఒక బృందంగా ప్రయాణించే అయ్యప్ప భక్తులు మొత్తం 45 సీట్లకు టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుని కేఎస్ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకోవచ్చు. భక్తులు తమ ప్రారంభ ప్రాంతాన్ని సూచిస్తే, బస్సు నేరుగా ఆ ఊరికే లేదా నిర్దేశిత ప్రాంతానికి వచ్చి వారిని ఎక్కించుకుని నేరుగా పంబా వరకు తీసుకెళ్తుంది. అయితే మొత్తం 45 సీట్లను తప్పనిసరిగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, పాక్షిక బుకింగ్‌లకు ఇందులో అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

సాధారణ టికెట్ ధరలే – అదనపు ఛార్జీలు లేవు

ప్రత్యేకంగా బస్సును చార్టర్ చేసినప్పటికీ భక్తులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ సర్వీసులకు వర్తించే టికెట్ ధరల ప్రకారమే ఛార్జీలు వసూలు చేస్తామని, చార్టరింగ్ పేరుతో ఎలాంటి అదనపు సర్వీస్ ఛార్జీలు వసూలు చేయబోమని మంత్రి తెలిపారు. కేరళలోని వివిధ జిల్లాలతో పాటు సమూహాలుగా ప్రయాణించే భక్తులకు ఇది ఎంతగానో ఉపశమనం కలిగిస్తుంది. కాగా, బుకింగ్ తేదీలు, రిజర్వేషన్ పోర్టల్ వివరాలను కేఎస్ఆర్టీసీ త్వరలోనే అధికారికంగా విడుదల చేయనుంది.

Tags

Be the first to react

Latest