ఐఫోన్, సాంసంగ్ లను తలదన్నేలా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు వచ్చేస్తున్నాయి!
ఆపిల్, శాంసంగ్ వంటి ప్రపంచ దిగ్గజ బ్రాండ్లతో పోటీపడేలా 2028 అక్టోబర్ నాటికి భారతదేశంలోనే డిజైన్ చేసి, తయారు చేసిన పూర్తి స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం దిగుమతి చేసుకున్న భాగాలను అసెంబ్లింగ్ చేయడం కాకుండా, పరిశోధన, ఇంజినీరింగ్ డిజైన్ మరియు మేధో సంపత్తి హక్కులను దేశంలోనే నిలుపుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
- కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన ప్రకటన.. అక్టోబర్ 23, 2028 డెడ్‌లైన్ ఖరారు!
- కేవలం అసెంబ్లింగ్ కాదు.. డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, బ్రాండింగ్ అంతా మన దేశంలోనే!
- మేక్ ఇన్ ఇండియా సరికొత్త మైలురాయి.. గ్లోబల్ మొబైల్ మార్కెట్లో స్వదేశీ బ్రాండ్ల దూకుడు!
Gadgets: అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆపిల్, శాంసంగ్ వంటి గ్లోబల్ దిగ్గజాలకు దీటైన పోటీ ఇచ్చేందుకు భారత్ సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అక్టోబర్ 23, 2028 నాటికి దేశీయంగా రూపొందించిన, ఇక్కడే తయారు చేసిన పూర్తి స్థాయి స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ఈ బృహత్తర ప్రణాళికను ప్రకటించారు.
అసెంబ్లింగ్ దశ దాటి సొంత డిజైన్ దిశగా
ఇప్పటివరకు భారతదేశం మొబైల్ విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అసెంబ్లింగ్ చేయడంలో ప్రధాన కేంద్రంగా కొనసాగింది. అయితే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆ దశను దాటి సొంత ఇంజినీరింగ్ డిజైన్, పేటెంట్లు, తయారీ మరియు బ్రాండింగ్‌ను సొంతం చేసుకోవడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. రేడియో-ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్స్, యాంటెన్నాలు, ప్రాసెసర్లు, మెమరీ, కెమెరా మాడ్యూళ్లు, డిస్ప్లేలు మరియు పవర్ మేనేజ్మెంట్ వ్యవస్థలను స్వదేశంలోనే రూపొందించే సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నారు.
ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (IP) హక్కుల పరిరక్షణ
మొబైల్ ఫోన్ డిజైనింగ్ అనేది అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక ప్రక్రియ అని మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. దేశీయంగా ఫోన్లను పూర్తిగా డిజైన్ చేయడం ద్వారా వాటికి సంబంధించిన మేధో సంపత్తి హక్కులు (Intellectual Property Rights) దేశంలోనే ఉంటాయని, ఇది దేశ భద్రతతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో విదేశీ ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గిస్తుందని స్పష్టం చేశారు.
ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారత్ జోరు
ప్రస్తుతం భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే వస్తువుల జాబితాలో ఎలక్ట్రానిక్స్ రంగం మూడో స్థానానికి చేరుకుందని, రాబోయే కొద్ది కాలంలోనే ఇది రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలతో (PLI స్కీములు) దేశీయ కంపెనీలకు మద్దతునిస్తూ గ్లోబల్ మార్కెట్లో భారతీయ బ్రాండ్లను చాంపియన్లుగా నిలబెట్టేందుకు రోడ్‌మ్యాప్ సిద్ధమైంది.