బెంగళూరులో బ్యాచిలర్స్ ఎదుర్కొంటున్న అన్యాయాలు, వివక్షపై మరోసారి చర్చ మొదలైంది. నగరాల్లో పనిచేస్తూ అద్దె ఇళ్లలో నివసిస్తున్న ఒంటరి యువకులు, యువతులు చాలా సార్లు హౌసింగ్ సొసైటీలు విధించే విచిత్ర నిబంధనలతో ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్ సొసైటీ విధించిన జరిమానా నెట్టింట పెద్ద వివాదంగా మారింది. ఇద్దరు యువతులు రాత్రిపూట తన ఫ్లాట్‌లో బస చేశారనే ఒక్క కారణంతో ఓ బ్యాచిలర్స్ జంటపై రూ.5,000 జరిమానా విధించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే—ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి బెంగళూరులోని ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నాడు. అక్టోబర్ 31 రాత్రి అతని స్నేహితురాలు ఇద్దరు యువతులు వారి ఫ్లాట్‌కి వెళ్లి రాత్రంతా అక్కడే ఉన్నారు. ఇది గమనించిన సొసైటీ యాజమాన్యం, తన స్వంత నిబంధనలు ఉల్లంఘించారంటూ నేరుగా రూ.5,000 ఫైన్ విధించింది. ఇన్‌వాయిస్‌లో ‘‘ఇద్దరు అమ్మాయిలు రాత్రిపూట బస చేయడం వల్ల జరిమానా’’ అని స్పష్టంగా పేర్కొనడం, ఈ నిర్ణయాన్ని ఇంకా వివాదాస్పదంగా మార్చింది.
ఈ అన్యాయంపై బాధితుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. “మా సొసైటీలో బ్యాచిలర్స్ అతిథులను రాత్రిపూట అనుమతించకూడదనే నిబంధన ఉందట. కానీ ఇదే రూల్ ఫ్యామిలీస్‌కు వర్తించదు. మాతో కూడా సమానమైన మెయింటెనెన్స్ తీసుకుంటూ మమ్మల్ని మాత్రం రెండో రకానికి చెందినవాళ్లుగా చూస్తున్నారు. కనీసం ముందుగా నోటీసు, హెచ్చరిక ఇవ్వకుండా నేరుగా జరిమానా విధించారు’’ అంటూ యువకుడు వివరించాడు. తన ఫ్లాట్‌మేట్ విషయం తెలియకపోవడంతో ఆ జరిమానా ఇప్పటికే చెల్లించినట్టు కూడా అతడు తెలిపాడు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భారీగా స్పందించారు. “బ్యాచిలర్స్‌ని ఇలా ఎన్నాళ్లు వివక్షతో చూస్తారు?” అని పలువురు ప్రశ్నిస్తుండగా, మరికొందరు ‘‘ఇలాంటి రూల్స్ చట్టవిరుద్ధం, కోర్టుకి వెళ్లండి’’ అని సలహా ఇచ్చారు. కొందరు సొసైటీ తీరును తీవ్రంగా విమర్శిస్తూ ‘‘ఇంటిని వెంటనే ఖాళీ చేయండి, ఇటువంటి నియమాలు పూర్తిగా అర్బన్ డిక్టేటర్‌షిప్’’ అని పేర్కొన్నారు. ఈ ఘటనతో మరోసారి మెట్రో నగరాల్లో బ్యాచిలర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, హౌసింగ్ సొసైటీల వివక్షపూరిత విధానాలు వెలుగులోకి వచ్చాయి.