అమెరికా విజిట్ వీసాతో ప్రయాణం చేసిన పల్నాడు జిల్లాకు చెందిన ఒక జంటకు ఇటీవల అనూహ్య ఇబ్బందులు, తీవ్ర నిరాశ ఎదురైంది. నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్లిన ఈ జంట అక్కడ వారి బంధువులతో రెండు నెలలు గడిపి, పాస్‌పోర్ట్ గడువు ముగుస్తుండడంతో భారత్‌కు తిరిగి వచ్చారు.
పాస్‌పోర్ట్ రెన్యువల్ పూర్తయ్యాక నవంబర్ చివరి వారంలో మళ్లీ అమెరికా వెళ్ళేందుకు బయల్దేరారు. అయితే డెట్రాయిట్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఇమిగ్రేషన్ అధికారులు వారిపై అనుమానం వ్యక్తం చేసి, రెండు నెలల వ్యవధిలో మళ్లీ రావడానికి కారణమేంటని వరుస ప్రశ్నలు అడిగారు.
చివరికి అమెరికాలో ప్రవేశానికి అనుమతి నిరాకరించి, వెంటనే భారత్‌కు వెళ్ళాలని ఆదేశించారు. సమస్యలు అక్కడితో ఆగక, తిరుగు ప్రయాణంలో పారిస్ ట్రాన్సిట్ సమయంలో ఫ్రాన్స్ ఇమిగ్రేషన్ అధికారులు వారిని నిలువరించి మూడు రోజులపాటు డిటైన్ చేశారు. ఎలాంటి స్పష్టమైన కారణం చెప్పకుండా వారిని ఆపేయడంతో ఆ జంట తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ పరిస్థితిని కుటుంబ సభ్యులు వెంటనే APNRT Society మరియు NRI TDP కు తెలియజేయగా, వారు వెంటనే స్పందించి ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదించే ప్రయత్నం చేశారు.
ఈలోపే ఆ జంటకు భారత్‌కు వెళ్లేందుకు అనుమతి లభించింది. వారిని ఎలాంటి ప్రశ్నలు ఆడగకుండా తిరగి భారత్ వెళ్లేందుకు అనుమటించారని ఆ జంట వెల్లడించారు. APNRT మరియు NRI TDP వెంటనే స్పందించడంతో కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మీరు కూడా మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పెద్దలతో తరచుగా ప్రయాణాలు చేస్తున్నారా, అయితే అవసరమైన అన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో మరోసారి నిర్ధారించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.