ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది కేంద్ర రైల్వే శాఖ. అమృత్ భారత్ పథకం కింద కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా పూర్తికావడంతో స్టేషన్ పూర్తిగా కొత్త శోభను సంతరించుకుంది. రూ.21.13 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో 99 శాతం పనులు ఇప్పటికే ముగిశాయని రైల్వే అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో స్టేషన్‌ను అధికారికంగా ప్రయాణికుల సేవలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే శాఖ ఇటీవలే పనుల పురోగతికి సంబంధించిన వీడియోను విడుదల చేస్తూ ఈ విషయాన్ని ధృవీకరించింది. నిధుల జాప్యం కారణంగా కొంత ఆలస్యమైనప్పటికీ, 2024 నుంచి పనులు వేగం పుంజుకోవడంతో ఆధునీకరణ వేగంగా పూర్తయ్యింది.
స్టేషన్‌కు అడుగుపెడుతూనే కొత్తదనాన్ని గుర్తించేలా పలు మార్పులు చేశారు. ప్లాట్‌ఫాంలను పూర్తిగా టైల్స్‌తో కొత్తగా అలంకరించి ఆకర్షణీయమైన రూపంలో తీర్చిదిద్దారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేలా పాత కుర్చీలను తొలగించి స్టీల్‌తో తయారు చేసిన సౌకర్యవంతమైన కొత్త సీటింగ్ ఏర్పాటు చేశారు. అదనంగా, రైల్వే ప్రదేశాన్ని విశాలంగా మార్చి, ట్రాక్‌ల మధ్య స్టీల్ డివైడర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రైల్వే కార్యకలాపాలకు మరింత భద్రత కల్పించారు. స్టేషన్ చుట్టూ గ్రీన్ కవర్ పెంచడానికి మొక్కలు నాటడం, స్టేషన్ లోపలి–బయటి మార్గాలను ఆకర్షణీయంగా ఆర్కిటెక్ట్‌ల చేత డిజైన్ చేయించడం వంటి పనులు స్టేషన్‌కు కొత్త రూపు ఇచ్చాయి. పార్కింగ్ ప్రదేశాన్ని పూర్తిగా రీ–డిజైన్ చేసి విస్తరించడం కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీలక భాగంగా నిలిచింది.
ప్రయాణికుల అవసరాలపై దృష్టి పెట్టడం ఈ ఆధునీకరణలో ముఖ్య లక్ష్యమైంది. తాగునీటి కోసం స్టీల్ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయటం, పాత మరుగుదొడ్లను పూర్తిగా తొలగించి కొత్త, పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు నిర్మించడం వంటి మెరుగుదలలు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయ్‌లెట్ సౌకర్యాలు, వీల్‌చైర్ యాక్సెస్ మార్గాలు మరియు ట్రాలీ బ్యాగులు తీసుకెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక పథాలు ఏర్పాటు చేశారు. సాధారణ మరియు ఏసీ వసతి గదులను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, రైలుల రాకపోకల సమాచారాన్ని తక్షణం అందించడానికి డిజిటల్ డిస్ప్లే సిస్టమ్‌లను ప్లాట్‌ఫాంలలో అమర్చారు.
స్టేషన్ ఆధునీకరణలో మరో విశేషం చరిత్రను సజీవంగా చూపించే కళా రూపకల్పన. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను స్టేషన్ గోడలపై ఆర్ట్‌వర్క్ రూపంలో చిత్రించడంతో స్టేషన్‌కు ఒక ప్రత్యేకత వచ్చేసింది. కొత్త లుక్, శుభ్రత, మెరుగైన సౌకర్యాలు కలిసి ప్రయాణికుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనున్న కాకినాడ టౌన్ స్టేషన్, అమృత్ భారత్ పథకం ద్వారా ఆధునిక రైల్వే హబ్‌గా అభివృద్ధి చెందుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యాలు, అందుబాటు, అందచందాలకు ప్రాధాన్యమిస్తూ ఈ ప్రాజెక్ట్ ఇతర స్టేషన్లకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.