ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని 5(2)కి సవరణ చేసేందుకు కొద్దిరోజుల కిందటే కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదముద్ర లభించింది.
కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత, త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం (గెజిట్) విడుదల చేస్తారు. విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంపిక చేసింది.
రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల రైతులు ముందుకొచ్చి 34వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వ సహకారంతో మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే అక్కడ అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించి పాలన ప్రారంభించారు. పెద్దఎత్తున రహదారులు, భవనాల నిర్మాణం మొదలైంది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో అమరావతి పనులు నిలిచిపోయాయి.
నాటి సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. 2024లో కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్లీ వెలుగులొచ్చాయి. రాజధాని నిర్మాణం కోసం రూ.58వేల కోట్లతో పనులు ప్రారంభించారు.
అమరావతికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా విభజన చట్టంలో సవరణ చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ పార్లమెంటు ద్వారా విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరారు.
పార్ట్-2 కింద 5(1): నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది.
పార్ట్-2 కింద 5(2): సబ్ సెక్షన్ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తారు. పార్ట్ 2-5(2) సబ్‌సెక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది అనేచోట అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కి నూతన రాజధాని ఏర్పాటైందని పేర్కొంటారు.
ఇప్పటికే రాజధాని అమరావతి పనులు అత్యంత వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ తమ సంస్థల నిర్వహణకు ఎంఓయూలు చేసుకున్న సంగతి తెలిసిందే. డేటా సెంటర్ సహా ఎన్నో కంపెనీలు నెలకొననున్నాయి.
ఇదిలా ఉండగా మరోవైపు రాజధాని అమరావతి నగర విస్తరణలో భాగంగా రెండోవిడత భూసమీకరణకు యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. తుళ్లూరు మండలంలో 3 గ్రామాలు, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో 4 గ్రామాల పరిధిలో రైతుల నుంచి భూమి సమీకరించనున్నారు.
ఇప్పటికే గ్రామసభలు నిర్వహించి మెజారిటీ రైతుల అభిప్రాయాలు సేకరించగా అత్యధికులు సానుకూలంగా స్పందించారు. తొలివిడత భూసమీకరణలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా అధికారులు రెండో విడతలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.