ట్రాఫిక్ చలాన్లపై 50 నుంచి 100 శాతం రాయితీ అంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ Hyderabad Traffic Police) పోలీసులు చెక్ పెట్టారు. ఎక్స్ వేదికగా ఈ ప్రచారంపై వివరణ ఇచ్చారు. ఈ నెల 13న లోక్ అదాలత్ లు జరుగుతున్న విషయం నిజమేనని,
అయితే చలాన్లపై రాయితీ వార్తలు మాత్రం అబద్ధమని తెలిపారు. వాహనదారులు అనధికారిక ప్రకటనను నమ్మకూడదని... కేవలం పోలీస్ శాఖ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ మాత్రమే చెక్ చేస్తూ ఉండాలని సూచించారు. ఫేక్ వార్తలు నమ్మొద్దని వాహనదారులకు సూచించారు.
లోక్ అదాలత్ Lok Adalat) లో చలాన్లపై రాయితీ.. వాహనదారులకు శుభవార్త, మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను లోక్ అదాలత్ లో రాయితీతో చెల్లించవచ్చునని ఆ వార్తల సారాంశం.
ఈ నెల 13న ట్రాఫిక్ పోలీసులు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని, లోక్ అదాలత్ కు హాజరై వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను 50 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీతో చెల్లించవచ్చని ఆ ప్రచారంలో పేర్కొన్నారు.
వివిధ రాష్ట్రాల్లో అదే రోజున లోక్ అదాలత్ లు నిర్వహిస్తుండటంతో ఈ ప్రచారం నిజమేనని వాహనదారులు భావించారు.
అయితే, ఈ ప్రచారం ఉన్నతాధికారుల వరకూ చేరడంతో తాజాగా హైదరాబాద్ (Hyderabad) ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ట్రాఫిక్ చలాన్లపై రాయితీకి సంబంధించి తమ శాఖ నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు.