కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ‘కృష్ణా తరంగ్ 2025’ ఉత్సవాల్లో పాల్గొన్న భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు భాష ప్రాధాన్యతపై తనదైన స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించారు. తాను చిన్నప్పటి నుంచే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థినని అనుకోకుండా హిందీ వ్యతిరేక ఉద్యమంలో కూడా పాల్గొన్న రోజులను గుర్తుచేసుకున్నారు. తన వ్యక్తిగత ప్రయాణమే మాతృభాష మనిషిని ఎంత దూరం తీసుకెళ్లగలదో ఒక ఉదాహరణ అని అన్నారు.
ఈ వేడుకల్లో మాట్లాడిన వెంకయ్య నాయుడు, తెలుగు నేర్చుకుంటేనే ఉద్యోగం వస్తుందని చెప్పినట్లయితేనే ప్రజలు తమ భాషకు విలువ ఇస్తారని వ్యాఖ్యానించారు. భాషను కేవలం ఇంటి వరకే పరిమితం చేయకుండా, ప్రభుత్వ కార్యక్రమాలు, పరిపాలన, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లో తెలుగు తప్పనిసరి కావాలని సూచించారు.
బ్రిటిష్ రాజ్ కాలంలో ఇంగ్లీష్ వాళ్లు తమ భాషను అధికార భాషగా చేసుకుని పాలన నడిపినట్లే, తెలుగు మాట్లాడే ప్రజలు తమ భాషను పరిపాలన భాషగా నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని నాయుడు వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా భారతీయ భాషలకు ప్రాధాన్యత పెంచాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మెడికల్, ఇంజనీరింగ్ వంటి ప్రావిణ్య రంగాల్లో మాతృభాషలోనే బోధన అందేలా మార్పులు జరుగుతున్నాయని వివరించారు.
తెలుగు మాట్లాడటం రాకపోతే ఉద్యోగాలకు అర్హత లేకపోయేలా కాకుండా, మాతృభాషపై ప్రేమ పెరగడానికి ప్రభుత్వాలు ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. “మనకు ఇంగ్లీష్ రాకపోయినా పేపర్ మీద రాసుకుని మాట్లాడవచ్చు, కానీ మన భాషలో మాట్లాడితే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది” అని నాయుడు అన్నారు.
తెలుగు భాష పట్ల కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప అన్న భావన పెంచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ముందుగా మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించి, ఆ తరువాత ఇతర భాషలు నేర్చుకోవడం మంచిదని చెప్పారు. భాష పట్ల అలాంటి ఆత్మగౌరవం ఉంటేనే మన సంస్కృతి, మనుగడ మరింత బలపడుతుందని నాయుడు స్పష్టం చేశారు.
తాను ఉప రాష్ట్రపతిగా ఉన్న సమయంలో, రాజ్యసభలో ఏ భాషలోనైనా సభ్యులు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చే విధంగా నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చామని గుర్తుచేశారు. దేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయనీ, ప్రతి భాషకు ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి, చైతన్యం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
వెంకయ్య నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో కొనసాగుతున్న భాషా చర్చలకు కొత్త ఊపునిచ్చాయి. మాతృభాషను విద్యలోనే కాదు, పరిపాలనలో కూడా ప్రాధాన్యంగా ఉంచాలన్న ఆయన సూచనలు విద్యా ప్రముఖులు, భాషా నిపుణుల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి. తెలుగు మీడియం మరోసారి గుర్తింపు వచ్చే వాతావరణం ఏర్పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు భాషకు గౌరవం, ప్రభుత్వ విధానాల్లో ప్రాధాన్యం, భవిష్యత్ తరాలకు మాతృభాష విలువ నేర్పడం ఇవి మూడు లక్ష్యాలు అమలు అయితేనే భాష నిజమైన అభివృద్ధి సాధిస్తుందని వెంకయ్య నాయుడు తన ప్రసంగంలో సూచించారు.