నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఎల్లారెడ్డిగూడెం సమీపంలో రెడీమిక్స్ లారీని ఓ డబుల్ డెక్కర్ ప్రైవేట్ టూరిస్టు బస్సు వేగంగా ఢీకొట్టింది. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీకి వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, అతడిని స్థానికులు బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇతర ప్రయాణికుల్లో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు రెండు కిలోమీటర్ల వరకు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని క్రేన్‌ల సాయంతో లారీ, బస్సును ట్రాక్ నుండి తొలగించి రాకపోకలను సమర్థవంతంగా పునరుద్ధరించారు.
ప్రమాదానికి వాహన వేగమే కారణమా లేదా డ్రైవర్ నిర్లక్ష్యమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.