రష్యా (Russia) తీర ప్రాంతంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూకంప కేంద్రం పెట్రోపవ్‌లావ్‌స్కీ-కామ్చాట్కా నగరానికి దక్షిణాన 144 కిలోమీటర్ల దూరంలో, పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean)లో ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ భారీ భూకంపానికి ముందు, దాదాపు ఒక గంట వ్యవధిలోనే ఐదు చిన్నపాటి భూకంపాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇవన్నీ కమ్చట్కా ద్వీపకల్పం పరిసర ప్రాంతాల్లోనే నమోదు అయ్యాయి.
7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం నేపథ్యంలో, పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం (PTWC) అధికారులు సునామీ వచ్చే అవకాశముందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కమ్చట్కా తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని, సముద్ర తీరాల నుంచి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భూకంపం తర్వాత కొంత సమయం పాటు సునామీ తరంగాలు రావచ్చు అనే హెచ్చరికలు కూడా ఉన్నాయి.