భారతదేశం ఉద్యోగాల కల్పనలో విశేషమైన పురోగతి సాధించిందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. జీ20 దేశాలతో పోలిస్తే భారత్‌లోనే నిరుద్యోగ రేటు అత్యల్పంగా ఉందని, ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 ప్రకారం భారత్‌లో నిరుద్యోగ రేటు కేవలం 2 శాతం మాత్రమేనని వెల్లడించారు.
సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు విస్తారంగా పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఈ విజయానికి బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు. యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ మెంటర్ టుగెదర్, క్విక్కర్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు.
ప్రస్తుతం జాతీయ కెరీర్ సర్వీస్ (NCS) పోర్టల్‌లో 52 లక్షల కంపెనీలు, 5.79 కోట్ల ఉద్యోగార్థులు రిజిస్టర్ అయ్యారని మంత్రి వివరించారు. ఇప్పటివరకు ఈ వేదిక ద్వారా 7.22 కోట్ల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని, ప్రస్తుతం 44 లక్షలకుపైగా ఉద్యోగాలు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద రూ.99,446 కోట్లతో రెండు ఏళ్లలో 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యమని, వీరిలో 1.92 కోట్ల మంది తొలిసారి ఉద్యోగాల్లో అడుగుపెట్టనున్నారని మాండవీయ వివరించారు.