నేపాల్ రాజధాని కాఠ్మాండూలో సోషల్ మీడియాపై ప్రభుత్వ నిషేధం తీవ్ర ఆందోళనలకు దారితీసింది. Gen-Z పేరిట యువత అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించగా, ప్రభుత్వం కర్ఫ్యూ విధించి ఫేస్బుక్, ఎక్స్ (Twitter), ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ యాప్‌లను నిషేధించింది. ప్రజల మధ్య సమాచారం పంచుకోవడాన్ని అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనక కారణమని చెబుతున్నారు.
అయితే, ఈ చర్య యువతలో మరింత ఆగ్రహాన్ని రగిలించింది. నిషేధాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, యువకులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. జర్నలిస్టు సంఘాలు కూడా ఈ నిరసనలకు మద్దతు తెలుపుతూ ఉద్యమంలో పాల్గొన్నాయి.
ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో నిరసనకారులు నేరుగా నేపాల్ పార్లమెంట్ భవనంపై దాడి చేశారు. ఒక్కసారిగా గుంపులు లోనికి చొరబడటంతో పరిస్థితి అదుపు తప్పింది. దీనితో పోలీసులు కఠిన చర్యలు చేపట్టి టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకుండా మరింత ఉద్రిక్తత సృష్టించడంతో చివరికి పోలీసులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా, 80 మందికి పైగా గాయపడ్డారు.
కాఠ్మాండూ వీధులు యుద్ధభూమిని తలపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ నిరోధక చర్యలు, మరోవైపు యువత ఆగ్రహం కలిసి పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల నిషేధం వల్ల సమాచారం చేరవేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యువత మాత్రం తమ ఆందోళనలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. “ప్రభుత్వం అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. మాకు మౌలిక హక్కులు ఇవ్వాలి” అని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.