ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు, వినియోగదారులకు మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలో కొత్తగా 80 రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 127 రైతు బజార్లు ఉండగా, వాటి సంఖ్యను పెంచి మొత్తం 207కి చేర్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.
రైతు బజార్ల వ్యవస్థను తొలిసారి 1999లో ప్రారంభించిన చంద్రబాబు నాయుడు.. దళారుల జోక్యం లేకుండా రైతులు నేరుగా వినియోగదారులకు పంటలు అమ్ముకునే అవకాశం కల్పించారు. ఈ బజార్ల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు రూ.2 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా 80 రైతు బజార్లు ఏర్పాటవడం వల్ల ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు, వాణిజ్య పంటలు లభిస్తాయని, రైతులకు మంచి ధర దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అదనంగా, రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేలా కూల్ ఛాంబర్లు, కోల్డ్ స్టోరేజ్ గదులు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరల సమయంలో ఉత్పత్తులను నిల్వ చేసి, ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు కల్పించనుంది. పంటల ధరలు, మార్కెట్ వివరాలను రైతుల మొబైల్స్‌కు మెసేజ్ సిస్టమ్ ద్వారా పంపే ఏర్పాట్లు చేస్తామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. అలాగే రైతు బజార్లలో ధరల వివరాలు చూపించేందుకు ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డులు, మొబైల్ యాప్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.