అమెరికాలో మరో విమాన ప్రమాదం కలకలం రేపింది. బోయింగ్ విమానాల్లో భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ డెల్టా ఎయిర్లైన్స్‌కు చెందిన బోయింగ్ 767-400 విమానంలో ఆకాశంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లాస్ ఏంజెలిస్ నుంచి అట్లాంటా వెళ్లేందుకు బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో మంటలు అలముకున్నాయి.
ఈ ఘటనతో విమాన సిబ్బంది అప్రమత్తమై వెంటనే అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ముందు జాగ్రత్త చర్యలతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. పెను ప్రమాదాన్ని సకాలంలో నివారించడంతో పెద్ద దుర్ఘటన తప్పింది.
ఈ విమానంలో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఇంజిన్‌లో మంటలు ఎలా వచ్చాయో, ఇందుకు గల కారణాలపై పరిశీలనలు కొనసాగుతున్నాయి. డెల్టా ఎయిర్లైన్స్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఇటీవలే అహ్మదాబాద్‌లో బోయింగ్ విమానం ఇంజిన్ నుంచి పొగలు వచ్చి అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో బోయింగ్ విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికులు గగనయానంపై భయంతో ఉన్నారు. విమానయాన రంగంలో ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి.