సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా గతంలో కోరేవాడినని.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడంతో పాటు.. పేదలకు సాయం చేయాలని కూడా అడుగుతున్నానని చెప్పారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం పీ4 జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులుగా ఉండాలని చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..”పీ4 కార్యక్రమం గురించి తలుచుకున్న ప్రతిసారి కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేయగలం. నాది సుదీర్ఘ రాజకీయ జీవితం. జాతీయ స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపించాం. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన ఆంధ్రప్రదేశ్ లో, జాతీయ స్థాయి రాజకీయాల్లో చాలా క్రియాశీలంగా పని చేశాం.