రైలు అనేది సగటు మధ్యతరగతి ప్రజలకు ‘నేల విమానం’ లాంటిది. సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మొదట గుర్తొచ్చేది రైలే. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణం చేయగల అవకాశముండటంతో పండుగల సమయంలోనూ, సాధారణ రోజుల్లోనూ రైళ్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే రైలు ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే అనేక మార్పులు చేస్తూ వస్తోంది.
ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ తాజాగా అధునాతన LHB బోగీలను (జర్మన్ టెక్నాలజీతో తయారైనవి) రైళ్లకు జతచేసింది. ఇవి కుదుపులు లేకుండా ప్రయాణం చేసే వీలు కలిగిస్తాయని, సీటింగ్ వ్యవస్థ కూడా విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణ ICF బోగీలతో పోలిస్తే ప్రమాదాల సమయంలో కూడా ఇవి నష్టం తీవ్రతను తగ్గిస్తాయి.
ప్రస్తుతం విజయవాడ డివిజన్‌లో పలు ప్రధాన రైళ్లకు, నగరాల మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ బోగీలను జత చేశారు. విశాఖపట్నం, సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, షిరిడీ వంటి మార్గాల్లో నడిచే రైళ్లలో కూడా ఇవి అమర్చబడ్డాయి. దశలవారీగా అన్ని రైళ్లలోనూ LHB బోగీలు ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు ప్రణాళిక చేస్తున్నారు.