దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనడానికి మరోసారి ఆధారాలు బయటపడ్డాయి. 2025 ఆగస్టులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. ఆగస్టు నెలలోనే ప్రభుత్వానికి రూ.1.86 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వచ్చాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.5 శాతం అధికం. వరుసగా ఎనిమిదో నెలగా జీఎస్టీ వసూళ్లు రూ.1.8 లక్షల కోట్ల మార్క్ దాటడం దేశంలో ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నట్టు సూచిస్తోంది.
ఆగస్టులో దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం 9.6 శాతం పెరిగి రూ.1.37 లక్షల కోట్లకు చేరింది. అయితే దిగుమతులపై పన్ను 1.2 శాతం తగ్గి రూ.49,354 కోట్లుగా నమోదైంది. రీఫండ్లు మినహాయించిన తర్వాత నికర ఆదాయం రూ.1.67 లక్షల కోట్లు కాగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 10.7 శాతం వృద్ధి అని కేంద్రం తెలిపింది.
ఈ నేపధ్యంలో త్వరలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా 5% మరియు 18% అనే రెండు కొత్త శ్లాబులు ప్రవేశపెట్టడం, అలాగే సిగరెట్లు, పొగాకు, చక్కెర పానీయాలు వంటి ‘సిన్ గూడ్స్’పై 40% ప్రత్యేక పన్ను విధించడం వంటి ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. ఇదే సమయంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ భారత వృద్ధి రేటు అంచనాను పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.2% నుంచి 6.7%కి అంచనాను పెంచుతూ నివేదిక విడుదల చేసింది. రాబోయే పండుగల సీజన్, జీఎస్టీ తగ్గింపులు డిమాండ్ పెంచుతాయని, దీంతో వృద్ధి రేటు అదనంగా 0.5% వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.