ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి పెద్ద అడుగు వేసింది. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC)కు చెందిన 22 హోటళ్లు, రిసార్ట్‌లను ప్రైవేట్ సంస్థలకు 33 ఏళ్ల లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ హోటళ్లు ఆరు క్లస్టర్లుగా విభజించి టెండర్ల ద్వారా అప్పగించనున్నారు. ప్రైవేట్ సంస్థలు తీసుకునే లీజు నిబంధనల్లో, వార్షిక స్థూల ఆదాయంలో కనీసం 12% లేదా నిర్ణయించిన వార్షిక అద్దె – ఏది ఎక్కువైతే అది చెల్లించాలి. ప్రస్తుతం హోటళ్లలో వసతులు, చెఫ్ సౌకర్యాలు తక్కువగా ఉండటంతో ఆదరణ తగ్గిందని, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ ద్వారా సేవలు మెరుగుపడి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఈ హోటళ్ల ద్వారా ఏటా రూ.10–15 కోట్ల ఆదాయం వస్తుండగా, ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే రూ.20 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. కేరళలో ఇదే విధానం అమలులో ఉందని, అక్కడ పర్యాటకులకు మంచి సేవలు అందుతున్నాయని అధికారులు చెబుతున్నారు. లీజు ప్రక్రియలో అనుభవజ్ఞులైన సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం ఈ హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగాలు పోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖపట్నం యాత్రి నివాస్ నుండి గండికోట, శ్రీశైలం వరకు విస్తరించి ఉన్న ఈ 22 హోటళ్లలో మొత్తం 222 గదులు ఉన్నాయి. పర్యాటక సదుపాయాలు మెరుగుపరచి, రాష్ట్రానికి అధిక ఆదాయం రావడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం.