దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025–26 విద్యా సంవత్సరం కోసం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం… తొలి విడత కౌన్సెలింగ్ జూలై 21 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరుగనుంది. ఈ దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 18వ తేదీ లోగా సంబంధిత కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.
రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 21న ప్రారంభమై ఆగస్టు 29వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. ఈ దశలో సీట్లు పొందిన వారు సెప్టెంబర్ 5వ తేదీ వరకు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
మూడో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు కొనసాగనుంది. ఈ విడతలో సీట్లు కైవసం చేసుకున్న విద్యార్థులు సెప్టెంబర్ 25వ తేదీలోగా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లకు సంబంధించి స్ట్రే కౌన్సెలింగ్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమై అక్టోబర్ 4 వరకు జరగనుంది. ఇందులో ఎంపికైన విద్యార్థులు అక్టోబర్ 10వ తేదీలోగా కాలేజీల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తనదైన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 24న, రెండో విడత సెప్టెంబర్ 11న, మూడో విడత సెప్టెంబర్ 30న, మాప్ అప్ రౌండ్ అక్టోబర్ 10లోగా పూర్తవుతాయి.
ఇక దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయి. మరోవైపు బుధవారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు 57 మంది హాజరయ్యారు. అలాగే మెడికల్ బోర్డులో దివ్యాంగుల వైకల్య పరీక్షలకు మొత్తం 28 మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు.