ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ జిల్లా ధరాలీ గ్రామాన్ని ఇటీవల సంభవించిన భారీ వరద తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. ఖీర్ గడ్, భాగీరథి నదులు ఉప్పొంగడంతో గ్రామంలో ఒక్కసారిగా భారీగా వరదనీరు ప్రవహించిది. ఫలితంగా పర్వత ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం బురదలో పూర్తిగా కూరుకుపోయింది. కొంతమంది ఇండ్లు వరద నీటితో కొట్టుకుపోగా, మరికొన్ని ఇండ్లను బురద కప్పేసింది. ఈ విషాదకర ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించగా, వంద మందికి పైగా గల్లంతైనట్లు వెల్లడించారు.
గల్లంతైన వారిని గుర్తించేందుకు రెస్క్యూ కార్యకలాపాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నుంచి అధికారులు సహాయాన్ని పొందుతున్నారు. శాటిలైట్ చిత్రాలను ఆధారంగా తీసుకొని గ్రామంలో ఇళ్లు ఉన్న ప్రదేశాలను గుర్తించి తవ్వకాలు చేపడుతున్నారు. బురదలో చిక్కుకున్నవారిని గుర్తించడంలో ఈ శాటిలైట్ చిత్రాలు కీలకంగా ఉపయోగపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక రెస్క్యూ కోసం అత్యాధునిక పరికరాలను యుద్ధప్రాతిపదికన విమానాల ద్వారా ధరాలీకి తరలిస్తున్నట్లు సమాచారం. గంగోత్రి యాత్రకు వెళ్తున్న యాత్రికులు సాధారణంగా ధరాలీ గ్రామంలో విశ్రాంతి తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడడం, వరదల కారణంగా రోడ్లు మూసుకుపోవడం వల్ల పలువురు యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. వారి సురక్షిత తరలింపునకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.