ఆగస్టు 7, 2025న కాకినాడ జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు సిటీ ఎమ్మెల్యే వనమూడి వెంకటేశ్వరరావుతో కలసి ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 33 ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. ఇంద్రపాలెం ఐడియల్ కళాశాలలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పాలిటెక్నిక్ తదితర అర్హతలు ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి.
ఈ మెగా జాబ్ మేళాలో ఎంపికయ్యే అభ్యర్థులకు వేదికపైనే ఆఫర్ లెటర్లు అందజేస్తారని నిర్వాహకులు వెల్లడించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది. కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యంలో ఉండటంతో, స్థానికంగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతీ నెల కూడా పిఠాపురం, జగ్గంపేట వంటి ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు.
వికాస సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళాలో రూ.16 వేల వరకు జీతంతో ఉద్యోగాలు లభించనున్నాయి. దీనివల్ల స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు మెరుగవడం కాక, వారి భవిష్యత్‌కు బలమైన బాట వేయనుంది. చాలా కాలం తర్వాత కాకినాడలో నిర్వహించబడుతున్న అతిపెద్ద జాబ్ మేళా ఇది కావడం విశేషం.