సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (BCAS) దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లలో భద్రతను పెంచాలని ఆదేశించింది. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2, 2025 మధ్య ఉగ్రవాద ముప్పు ఉండే అవకాశం ఉందని సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీలు సమాచారం ఇచ్చాయి. ఈ ముప్పు పాకిస్థాన్‌కు చెందిన ఒక ఉగ్రవాద గ్రూప్ కార్యకలాపాలకు సంబంధించినదని చెబుతున్నారు.
అందువల్ల ఎయిర్‌పోర్ట్‌లు, ఎయిర్‌స్ట్రిప్‌లు, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లు, హెలిప్యాడ్‌లలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని BCAS ఆదేశాలు జారీ చేసింది. స్థానిక పోలీస్, CISF, ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం పెంచాలని సూచించింది.
ప్రత్యేకంగా సిబ్బంది, కాంట్రాక్టర్లు, సందర్శకులందరి IDలను ఖచ్చితంగా చెక్ చేయాలి. అన్ని CCTV కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో పరిశీలించి, నిరంతరం మానిటర్ చేయాలి. ఈ ఆదేశాలు రాష్ట్ర పోలీస్, ఎయిర్‌పోర్ట్‌లు, ఎయిర్‌లైన్స్ సహా అన్ని సంబంధిత విభాగాలకు పంపించబడ్డాయి.