దేశంలో డిజిటల్ సేవలను మరింత సులభతరం చేస్తూ ఆధార్ టెక్నాలజీ మరో ఘన మైలురాయిని సాధించింది. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ సేవలు జులై నెలలో 19.36 కోట్ల లావాదేవీలతో రికార్డు స్థాయిని తాకాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 5.77 కోట్ల లావాదేవీలు జరిగాయని యూఐడీఏఐ వెల్లడించింది. అలాగే, జూన్ నెలతో పోల్చితే ఈ సంఖ్యలో 22 శాతం వృద్ధి నమోదైంది. జులై 1న ఒక్కరోజే 1.22 కోట్ల లావాదేవీలు చోటుచేసుకున్నాయి, ఇది గత మార్చి నెలలో నమోదైన 1.07 కోట్ల రికార్డును దాటింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150కు పైగా సంస్థలు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సేవలను వినియోగిస్తున్నాయి. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆయిల్ కంపెనీలు, టెలికాం ఆపరేటర్లు ప్రధానంగా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ సాంకేతికత సేవలను వేగంగా, సురక్షితంగా అందిస్తున్నది. ముఖ్యంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ సదుపాయంతో తమ గుర్తింపును సులభంగా ధృవీకరిస్తున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద జులైలో 13.66 లక్షల మంది లబ్ధిదారులు ఈ ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించారు.
ఇకపోతే, ఫేస్ అథెంటికేషన్ తో పాటు వేలిముద్రలు, ఐరిస్ వంటివి కలిపి జులై నెలలో మొత్తం ఆధార్ అథెంటికేషన్ లావాదేవీలు 221 కోట్లకు చేరుకున్నాయి. అదేవిధంగా ఆధార్ ఈ-కేవైసీ లావాదేవీలు 39.56 కోట్లుగా నమోదయ్యాయి. ఈ గణాంకాలు ఆధార్ టెక్నాలజీ ప్రభుత్వం సేవల విస్తరణలో, సంక్షేమ పథకాల నిమిత్తం ఎంత ప్రధానంగా ఉపయోగపడుతోందో స్పష్టంగా సూచిస్తున్నాయి అని యూఐడీఏఐ తెలిపింది.