ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 12 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న భవనాలకు కేవలం 72 గంటల్లోనే నిర్మాణ అనుమతులు లభించనున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ప్రకటించారు. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. ఈ కొత్త విధానం వల్ల నిర్మాణదారులు వేగంగా పనులు ప్రారంభించుకునే వీలుంటుంది.
నిర్మాణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం రెండు దశల సమీక్ష విధానాన్ని అమలు చేయనుంది. దరఖాస్తు వచ్చిన 36 గంటల్లో సంబంధిత కమిషనర్, పట్టణ ప్రణాళిక విభాగాధిపతి సమాచారం ఏపీడీపీఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అనంతరం రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుడి కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమీక్షించి అనుమతులు జారీ చేయాలి. ఈ మార్గదర్శకాలను సీఆర్డీఏ, వీఎంఆర్డీఏతో పాటు పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
గతంలో బహుళ అంతస్తుల నిర్మాణ అనుమతుల కోసం నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ క్రమంలో అనుమతి ప్రక్రియలో జాప్యం, ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే ఇప్పుడు 72 గంటల్లోనే అనుమతులు ఇవ్వడం వల్ల ఆ సమస్యలు తొలగనున్నాయి. ఒకవేళ దరఖాస్తులో అవసరమైన డాక్యుమెంట్లు పూర్తి లేకపోతే లేదా అభ్యంతరాలు ఉంటే మాత్రమే ఆలస్యం కావొచ్చు. పేదలు, మధ్యతరగతి వారి ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే సులభతరం చేసిన విషయం తెలిసిందే.