ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు పోస్టులకు జరిగే ప్రిలిమినరీ పరీక్షలను తొలగించి, ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన గవర్నమెంట్ ఆర్డర్ (జీఓ) 39 ప్రకారం, ఒక పోస్టుకు 200కి పైగా దరఖాస్తులు వచ్చినప్పుడు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు, ఒక పోస్టుకు ఇచ్చిన సంఖ్యకు 200 రెట్లు దరఖాస్తులు దాటిన సందర్భంలో మాత్రమే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి ఫిల్టర్ చేయనున్నట్లు నిర్ణయించారు.
ఈ కొత్త విధానంపై ఏపీపీఎస్సీ కమిషన్ తుది తీర్మానం తరువాతనే తదుపరి చర్యలు తీసుకుంటుంది. దీంతో భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు రాకుండా, పరీక్షల నిర్వహణలో అధికారం కమిషన్‌కు నేరుగా ఇవ్వాలని కూడా కోరింది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రతిపాదనలకు అనుమతులు జారీ చేయబడినాయి. ఈ మార్పుతో ఏపీపీఎస్సీ నిర్వహించే ఎక్కువ పరీక్షలకు ఒక్కటే పరీక్ష విధానం అమలవుతుంది. అయితే, గ్రూపు 1, గ్రూపు 2 పోస్టులకు మాత్రం మినహాయింపు ఇవ్వబడి, మిగతా అన్ని పోస్టులను దాదాపుగా ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ నిర్ణయంతో అభ్యర్థులకు సన్నద్ధం కావడానికి ఎక్కువ సమయం లభించడం, ఖర్చులు తగ్గించడం, విలువైన సమయాన్ని వృథా చేయకుండా ఉండటం వంటి లాభాలు ఉంటాయి. అలాగే, పరీక్షల నిర్వహణలో కమిషన్‌పై ఉన్న భారమూ, ఖర్చు కూడా తగ్గుతుంది. కొత్త విధానం ప్రకారం, పరీక్షలు ఆఫ్‌లైన్‌లో ఒకే షిఫ్టులో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్షలకు ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.వెయ్యి ఖర్చు పడే విషయంలో, ఆఫ్‌లైన్ పరీక్షలు ఖర్చులను తగ్గించగలవని కమిషన్ అభిప్రాయపడింది. ఇటీవల ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఇప్పటివరకు 47,000 దరఖాస్తులు వచ్చాయని, వీటి సంఖ్య లక్షకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.