దేశంలోనే అతి పొడవైన గూడ్స్ రైలును పట్టాలెక్కిస్తూ రైల్వే శాఖ కొత్త రికార్డు సృష్టించింది. సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) పరిధిలోని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ (DDU) డివిజన్ ఈ రైలును విజయవంతంగా నడిపింది. ఈ రైలుకు ‘రుద్రాస్త్ర’ అనే పేరు పెట్టారు. ఆగస్టు 7న పట్టాలపైకి ఎక్కిన ఈ రైలు, భారత రైల్వే చరిత్రలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలు కావడం విశేషం. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ రైలుకు సంబంధించిన వీడియోను శుక్రవారం తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు.
డీడీయూ డివిజన్‌లోని గంజ్ కవాజా స్టేషన్ నుంచి మధ్యాహ్నం బయల్దేరిన రుద్రాస్త్ర రైలు, 4.5 కిలోమీటర్ల పొడవుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గంజ్ కవాజా నుంచి గర్హ్వా రోడ్ స్టేషన్ వరకు సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఈ రైలు కేవలం ఐదు గంటల్లో పూర్తి చేసింది. సగటున గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు పయనించింది.
ఆరు ఖాళీ బాక్సన్ ర్యాకులను కలిపి ఈ రుద్రాస్త్ర రైలును రూపొందించారు. మొత్తం 354 వ్యాగన్లు ఉండే ఈ రైలును నడిపేందుకు ఏడు ఇంజిన్లను ఉపయోగించారు. సరకు రవాణాలో వేగం, సామర్థ్యాలను పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం అని అధికారులు తెలిపారు.
సాధారణంగా ఈ రైళ్లను వేర్వేరుగా నడపాల్సి వస్తే, ఆరు వేర్వేరు మార్గాలు, సిబ్బంది అవసరమవుతాయి. కానీ వీటిని ‘రుద్రాస్త్ర’గా ఒకే రైలుగా నడపడం వల్ల గణనీయమైన సమయం ఆదా అవ్వడమే కాకుండా, ట్రాక్‌పై మరిన్ని రైళ్లు నడపడానికి అవకాశం లభిస్తుందని ఈసీఆర్ స్పష్టంచేసింది.