ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అధికారులు రైల్వే బోర్డుకు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం, మొత్తం 1,336.60 కి.మీ మేర కొత్త మరియు అదనపు రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.32,982 కోట్లుగా నిర్ధారించారు.
కొత్తగా ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య 105.31 కి.మీ, భద్రాచలం–కొవ్వూరు మధ్య 70.30 కి.మీ, అట్టిపట్లు–పుత్తూరు (ఏపీ పరిధిలో) మధ్య 30 కి.మీ రైల్వే లైన్లు ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇలా మొత్తం 205.61 కి.మీ కొత్త లైన్లు ఏర్పడనున్నాయి. మిగిలినవి ప్రధాన మార్గాల్లో రద్దీని తగ్గించడానికి 2, 3, 4 లైన్ల విస్తరణ పనులు ఉంటాయి.
ప్రధాన ప్రాజెక్టులు: 1. భద్రాచలం–కొవ్వూరు కొత్త లైన్ – 70.30 కి.మీ – రూ.1,695.71 కోట్లు. 2. ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ–ప్రశాంతి నిలయం – 105.31 కి.మీ – రూ.2,505.89 కోట్లు. 3. అట్టిపట్లు–పుత్తూరు (ఏపీ) – 30 కి.మీ – రూ.179.17 కోట్లు. 4. నిడదవోలు–దువ్వాడ మూడో లైన్ – 205.70 కి.మీ – రూ.3,497.71 కోట్లు. 5. నిడదవోలు–దువ్వాడ నాలుగో లైన్ – 230 కి.మీ – రూ.10,294.46 కోట్లు. 6. నల్లపాడు–కృష్ణ కెనాల్ మూడో, నాలుగో లైన్ – 33.62 కి.మీ – రూ.1,151.41 కోట్లు 7. ఓబులవారిపల్లి–రేణిగుంట మూడో లైన్ – 53.97 కి.మీ – రూ.1,365.04 కోట్లు. 8. ఓబులవారిపల్లి–గుంతకల్లు మూడో లైన్ – 254 కి.మీ – రూ.3,606.70 కోట్లు. 9. ఓబులవారిపల్లి–గుంతకల్లు నాలుగో లైన్ – 256 కి.మీ – రూ.5,207.98 కోట్లు 10. ఇందుపల్లి, దుగ్గిరాల బైపాస్‌లు – 36.8 కి.మీ – రూ.1,895.03 కోట్లు. 11. రేణిగుంట రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి – 20 కి.మీ – రూ.902.88 కోట్లు. 12. బళ్లారి–చిక్కజాజూరు రెండో లైన్ (ఏపీ) – 40.90 కి.మీ – రూ.680.67 కోట్లు
మొత్తం 12 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 1,336.60 కి.మీ మేర రైల్వే లైన్ల నిర్మాణానికి రూ.32,982.65 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉండగా, ఏపీ ప్రభుత్వం మాత్రం నిధుల బాధ్యత రైల్వే శాఖపైనే ఉందని స్పష్టం చేసింది.